జాడలేని వానలు..

Less Rain Damage Crops In Telangana - Sakshi

ఎండుతున్న పంటలు

అప్పులు తెచ్చి దిక్కులు చూస్తున్న రైతన్నలు

మరో 10 రోజులు వర్షాల్లేకుంటే పంటలపై ఆశలు గల్లంతే! 

ఎండిపోతున్న నారుమళ్లు.. పత్తిదీ అదే పరిస్థితి 

ఇప్పటివరకు 56 లక్షల ఎకరాల్లో పంటల సాగు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : అప్పులు చేసి పంటలు వేసినవారు కొందరు.. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కాలని దుక్కి దున్నినవారు ఇంకొందరు.. ఎకరాలకొద్దీ కౌలుకు తీసుకొని విత్తు వేసిన వారు మరికొందరు.. చినుకు జాడ లేకపోవడంతో ఇప్పుడు వీరందరికీ కంటిమీద కునుకు లేదు! నేలను నమ్ముకొని నింగివైపు ఆశగా చూస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. జూన్‌ చివరి వారంలో కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసిన అన్నదాతలు తలలు పట్టుకున్నారు. మరో 10 రోజులు ఇలాగే వర్షాలు పడకుంటే పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల వర్షాల్లేక మొలకెత్తిన విత్తనాలు మాడిపోయాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందిన కాడికి అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 

పత్తికి ట్యాంకర్లతో నీళ్లు 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అత్యధికంగా 35 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 5.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. చెరువులు నిండి బావులు, బోర్లలోకి నీరు వస్తుందని భావించిన రైతుల ఆశలు గల్లంతయ్యాయి. మరో పది రోజులపాటు వర్షాలు కురవకపోతే పత్తి, మొక్కజొన్న, పసుపు వంటి వాణిజ్య పంటల పరిస్థితి దారుణంగా మారుతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో వరి కోసం నారుమళ్లు పోసిన రైతులు ఇప్పటిదాకా నాట్లు వేయలేదు. నాగర్‌ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో నారుమళ్లు ఎండిపోయాయి. ఈ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వనపర్తి జిల్లాలో గడచిన ఏడాది ఇదే సమయానికి 2.11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే ఈ ఏడాది కేవలం 40 వేల ఎకరాల్లోనే సాగయ్యాయి. కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని తీసుకెళ్లి పత్తి మొక్కలకు బకెట్ల ద్వారా నీటిని పోస్తున్నారు.

‘‘మరో వారం రోజుల్లో ఓ మోస్తరు వర్షం అయినా కురవకపోతే పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ విభాగం చెప్పడం వల్ల కూడా రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంటలు ఎండిపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలి’’అని వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. తాజా పరిస్థితిపై సీఎంకు లేఖ రాస్తానని, వనపర్తి జిల్లాలో మంచినీటికి కూడా సమస్యగా ఉందని సాక్షి ప్రతినిధితో చెప్పారు. 

వరి మరీ దారుణం 
రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే వరి పరిస్థితి ఈసారి దారుణంగా ఉంది. గడచిన ఏడాది ఇదే సమయానికి సాగు చేసిన దానికన్నా 25 శాతం అధికంగా వరి వేశారు. కానీ వానల్లేక పలుచోట్ల నారుమళ్లు ఎండిపోతున్నాయి. వర్షాలు బాగా పడతాయని ఆశించి గ్రామాలకు వచ్చిన వలసదారులు ఉపాధి కోసం మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘‘నాకు 2 ఎకరాల భూమి ఉంది. ముంబైలో కూలీ పని చేస్తా. మంచి వర్షాలు కురుస్తాయంటే వరి పండించుకుందామని వచ్చి నారుమడి పోశా. కానీ వానల్లేక ఎండిపోయింది. రూ.14 వేలు నష్టపోయా. మళ్లీ ముంబై వెళ్లక తప్పడం లేదు’’అని మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లికి చెందిన అంజయ్య ఆవేదన చెందాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, వికారాబాద్‌ జిల్లా తాండూరు, పరిగి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతాల్లో వరి నారుమళ్ల దశలోనే ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖకు ప్రాథమిక సమాచారం అందింది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top