
బుధవారం అమెరికాలో అడ్వామెడ్-2016 సమావేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్ గారీ ప్రుడెన్ తదితరులతో మంత్రి కేటీఆర్
పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల సులభ నిర్వహణ సూచీలో భారతదేశంలోనే తెలంగాణ తొలి ర్యాంక్‌లో నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు...
అడ్వా మెడ్-2016 సమావేశంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల సులభ నిర్వహణ సూచీలో భారతదేశంలోనే తెలంగాణ తొలి ర్యాంక్‌లో నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మెడికల్ టెక్నాలజీ పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనువైన పెట్టుబడుల కేంద్రంగా ఉందని తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం ప్రతిష్టాత్మకమైన అడ్వా మెడ్-2016 సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలోనే అత్యుత్తమ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో హైదరాబాద్ ముందుందని, మెడికల్ టూరిజమ్‌కు అనువైన గమ్యస్థానంగా ఉందని చెప్పారు.
వివిధ రంగాలకు సంబంధించి నిర్వహించిన ప్రధాన సర్వేల్లో హైదరాబాద్ అత్యున్నత ర్యాంకును సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ సమీపంలో ఫార్మాసిటీ, మెడికల్ డివైస్ పార్కులను ఏర్పాటు చేస్తున్నందున రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమెరికాలోని వైద్య సాంకేతిక సంస్థలను కోరారు. హెల్త్‌కేర్, ఫార్మా, మెడికల్ డివైస్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో క్లియరెన్స్, సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి అంశాలను ప్రస్తావించారు. జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్ గారీ ప్రుడెన్, మెడ్రానిక్ మెడికల్ టెక్నాలజీ చైర్మన్ ఒమర్ ఇష్రాక్, టెలిఫ్లెక్స్ చైర్మన్, సీఈవో బెన్సన్ స్మిత్, స్ట్రైకర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో కెవిన్ లోబో తదితరులతో కేటీఆర్ సుధీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.