నగరం..అభివృద్ధి పథం | Sakshi
Sakshi News home page

నగరం..అభివృద్ధి పథం

Published Sat, Apr 14 2018 9:23 AM

Ktr Prices Greater Hyderabad - Sakshi

గ్రేటర్‌లో జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో... అభివృద్ధి కూడా అంతే వేగంగా జరుగుతోందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల ప్రసంగించారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.  

కూకట్‌పల్లి: తెలంగాణ ఏర్పడ్డాక గ్రేటర్‌లో అధిక అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఆయన కూకట్‌పల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఎన్నో అనర్థాలు వస్తాయని చెప్పిన నేతలకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధే చెంపపెట్టు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తుందన్నారు.  గత పాలకుల కారణంగా పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడేవని, నేడు పల్లెటూరులో సైతం విద్యుత్‌ సరఫరా నిరంతరం అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. గతంలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో ప్రదర్శన చేసేవారని, నేడు ఆ పరిస్థితికి చెక్‌ పెట్టామని, 100 శాతం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు  అందిస్తున్నామని తెలిపారు. నగరంలోనే కూకట్‌పల్లిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

మొదటిసారిగా మహిళా పార్కును ఏర్పాటు చేయటం విశేషమన్నారు.  సున్నం చెరువు అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని పేర్కొన్నారు. నగరంలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో 50 శాతం విద్యుత్‌ ఖర్చు తగ్గిందన్నారు.  ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ గత పాలకులు ఓట్లు మాత్రం దండుకుని అభివృద్ధి చేయకుండా ప్రజలకు మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల ప్రభుత్వమని తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ రిజర్వాయర్‌ ప్రారంభంతో పూర్వ మోతీనగర్‌ డివిజన్‌లో నీటి సమస్య శాశ్వతంగా తీరిందని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ సహాయ సహకారా>లతో 290 కోట్ల రూపాయలతో రిజర్వాయర్‌ నిర్మించామన్నారు. నియోజకవర్గంలో 4400 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కార్పొరేటర్‌ సబిహా బేగం, తూము శ్రావణ్‌కుమార్, పన్నాల కావ్యరెడ్డి, పండాల సతీష్‌ గౌడ్, దొడ్ల వెంకటేష్‌ గౌడ్, కాండూరి నరేంద్రాచార్య, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement