గాల్లోకి ఎగిరిన 3డీ యూఏవీ

KTR Appreciated The Efforts Made By T Works - Sakshi

మరింత మెరుగైన వెహికల్‌ తయారీ: టీ వర్క్స్‌

సాక్షి, హైదరాబాద్‌: తొలి 3డీ ముద్రిత మానవ రహిత ఏరియల్‌ వెహికల్‌ (యూఏవీ) తొలిసారిగా మంగళవారం విజయవంతంగా గాలిలోకి ఎగిరింది. 3డీ ముద్రిత మానవ రహిత విమానాన్ని ‘టి వర్క్స్‌’గతేడాది నవంబర్‌లో రూపొందించగా, పలు ప్రయత్నాల తర్వాత గాలిలోకి ఎగిరింది. గంటకు 80 కి.మీ. వేగంతో గాలిలోకి ఎగిరిన విమానం వేగం పుంజుకుని ఆ తర్వాత గంటకు 140 కి.మీ. వేగాన్ని అందుకుంది. సుమారు రెండు నిమిషాల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత రేడియో సంబంధాలను కోల్పోయి నేలకూలింది. ఈ అనుభవంతో మరింత మెరుగైన యూఏవీని త్వర లో తయారుచేస్తామని టి వర్క్స్‌ ప్రకటించింది. 3డీ ముద్రిత యూఏవీని తయారు చేయడంలో టి వర్క్స్‌ చేసిన కృషిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు.

ఎన్నో ప్రత్యేకతలను కలిగిన యూఏవీ తయారీలో పూర్తిగా 3డీ ముద్రిత విడి భాగాలను ఉపయోగించారు. ఈ విడి భాగాలను పాలీ లాక్టిక్‌ యాసిడ్‌ (పీఎల్‌ఎ), అక్రిలోనైట్రిల్‌ బ్యూటడీన్‌ స్టిరీన్, హై ఇంపాక్ట్‌ పాలిస్ట్రీన్‌ (హెచ్‌ఐపీఎస్‌) వంటి పదార్థాలతో తయారు చేశారు. ఒకటిన్నర కిలోల బరువున్న ఈ యూఏవీని గంటకు 200 కి.మీ. వేగంతో పయనించే సామర్థ్యం తో రూపొందించారు. మంగళవారం జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో 3డీ ముద్రిత యూఏవీల ఎయిరోడైనమిక్‌ ధర్మాలను విశ్లేషించి, మరింత మెరుగైన యూఏవీని తయారుచేసేందుకు టి వర్క్స్‌ సన్నాహాలు చేస్తోంది.

ప్రోటోటైప్‌ల తయారీ సులభం..
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమెకానికల్, మెకానికల్‌ రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్‌ సెంటర్‌గా పేరొందిన టి వర్క్స్‌.. ఎయిరోస్పేస్‌ రంగంలో 3డీ ప్రింటింగ్‌ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరుపై వరుస పరిశోధనలు చేస్తోంది. గతంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలను కలప, ఫ్లైవుడ్‌తో తయారు చేసేందుకు నాలుగైదు వం దల గంటల సమయం పట్టేది. కానీ కంప్యూటర్‌ లో విడి భాగాల డిజైనింగ్, 3డీ ప్రింటర్ల ద్వారా ప్రోటోటైప్‌ల తయారీ సులభతరమైంది. యూ ఏవీలో అంతర్భాగాలను నట్లు, బోల్టులు తదితరాలతో సంబంధం లేకుం డానే తేనెపట్టులో అమర్చినట్లు బిగించి రూపాన్ని ఇచ్చారు. లిథి యం పాలిమర్‌ బ్యాటరీ వినియోగంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సంక్లిష్టతతో తయారు చేసిన ఈ యూఏవీ డిజైన్, 3డీ విడి భాగాల ముద్రణకు వంద గంటల సమయం మాత్రమే పట్టిందని టి వర్క్స్‌ వర్గాలు వెల్లడించాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top