చేయూతనందిస్తే సత్తా చాటుతా..!

Kiran Kumar Want to Help For World Body Building Championship - Sakshi

మిస్టర్‌ వరల్డ్‌ బాడీబిల్డింగ్‌

పోటీలకు ఎంపికైన కిరణ్‌కుమార్‌

దాతలు సహకరిస్తే మరిన్ని విజయాలు సాధిస్తా

ప్రభుత్వ సహకారం అందించాలని వినతి

మారేడుపల్లి : చైనా దేశంలోని మంగోలియాలో సెప్టెంబర్‌ 12 నుంచి 18 వరకు  జరగనున్న మిస్టర్‌ ఏషియన్, మిస్టర్‌ వరల్డ్‌ బాడీబిల్డింగ్‌ పోటీలకు  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ కాకగూడకు చెందిన సంజీవ కిరణ్‌కుమార్‌ ఎంపికయ్యాడు.  మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపిక కావడమే తన లక్ష్యమని, తన కల సాకారం అయ్యే రోజులు దగంగరలోనే ఉన్నాయని అందుకు ప్రభుత్వం, దాతలు  సహకారం అందించాలని కోరాడు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

చిన్నతనం నుంచే బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి...
కంటోన్మెంట్‌ కార్ఖానా కాకగూడకు చెందిన కిరణ్‌కుమార్‌ (27) జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తూనే తన ఆశయసాధన కోసం శక్తివంచలేకుండా కృషి చేస్తున్నాడు. చిన్నతనం నుంచే బాడీబిల్డింగ్‌పై ఆసక్తిని పెంచుకున్న అతను 2001 నుంచి శరీర దృఢత్వ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో రికార్డులు సాధించాడు. మిస్టర్‌ తెలంగాణ టైటిల్‌ విన్నర్‌గా 8సార్లు, మిస్టర్‌ ఉస్మానియా 6 సార్లు, మిస్టర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ 8 సార్లు ఎంపికయ్యాడు. మిస్టర్‌ సౌత్‌ ఇండియా 3 సార్లు, గోల్డ్‌మెడల్, ఫెడరేషన్‌కప్‌ (సిల్వర్‌) సాధించాడు. ఈ నెల 6, 7 తేదీల్లో ఖమ్మంలో జరిగిన ఇండియన్‌ బాడీబిల్డర్స్‌ ఫెడరేషన్‌లో 200 మంది పాల్గొనగా రాష్ట్రం నుండి  90 కిలోల కేటగిరిలో మిస్టర్‌ వరల్డ్‌కు కిరణ్‌కుమార్‌ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఓల్డ్‌ వాసవీనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తేలుకుంట సతీష్‌కుమార్‌ గుప్తా పలువురు కిరణ్‌కుమార్‌ను అభినందించారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని కిరణ్‌కుమార్‌ పేర్కొన్నాడు. జిమ్‌ కోచ్‌గా పనిచేస్తూ వచ్చిన ఆదాయంతోనే తన ఖర్చులను చూసుకోవాల్సి వస్తుందన్నారు. నిత్యం ఆరు గంటలు జిమ్‌లోనే సాధన చేయాల్సి ఉంటుందని, అందుకు ప్రొటీన్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు తనకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిస్టర్‌ వరల్డ్‌–2019 టైటిల్‌ సాధించడమే తన లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తంచేశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top