ఖరీఫ్‌కు వీలైనంత త్వరలో సాగునీరు

ఖరీఫ్‌కు వీలైనంత త్వరలో సాగునీరు


అందించాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం

► సింగూరు, ఘనపురం, కడెం ప్రాజెక్టుల నుంచి నీరివ్వాలని సూచన

► సాగునీటి కార్యాచరణ ప్రణాళిక, ఆయకట్టు లక్ష్యాలపై సమీక్ష  
సాక్షి, హైదరాబాద్‌: నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల నుంచి వీలైనంత త్వరలో ఖరీఫ్‌కు సాగునీరు విడుదల చేయాలని నీటిపారుదల  హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ సాగునీటి కార్యాచరణ ప్రణాళికపై గురువారం సచివాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సింగూరు, ఘనపురం, కడెం, నీల్వాయి, మత్తడి వాగు, కుమ్రం భీం, గొల్ల వాగు, నల్లవాగు ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదలకు చర్యలు తీసుకోవా లన్నారు.


ప్రస్తుతం నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టు ల్లో సింగూరు నుంచి 40 వేల ఎకరాలు, ఘనపురం నుంచి 20 వేల ఎకరాలు కడెం నుంచి 50 వేల ఎకరాలు, నీల్వాయి నుంచి 7 వేలు, గొల్లవాగు నుంచి 6 వేలు, కుమ్రం భీం నుంచి 21 వేలు, మత్తడి వాగు నుంచి 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిం చాలని ఆదేశించారు. ఇందుకుగాను ఎస్సారె స్పీ, నాగార్జునసాగర్, ఏఎంఆర్పీ, నిజాం సాగర్‌ తదితర ప్రాజెక్టుల పరిధిలో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని హరీశ్‌రావు సూచించారు.


వివిధ ప్రాజెక్టుల డ్యాంల గేట్లను పటిష్టం చేయాలని, మరమ త్తు పనులను పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ను ముందస్తుగా ప్రారంభించడం వల్ల యాసంగిలో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే వీలవుతుందన్నారు. ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళికపై మరో వారంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దపల్లిలో గతేడాది అమలు చేసిన ‘టెయిల్‌ టు ఎండ్‌’ విధానం విజయవంతమై నందున ఇదే ప్రయోగాన్ని వీలైనన్ని ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలలో ప్రవే శపెట్టాలని హరీశ్‌రావు సూచించారు.


నిజాం సాగర్‌ కింద గతేడాది సమర్థంగా సాగు నీటి యాజమాన్యం జరిగిందని, అదే స్ఫూర్తిని మిగతా ప్రాజెక్టుల్లోనూ కొనసాగించాలన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్, ఈఎన్‌సీలు మురళీధర్, విజయప్రకాశ్, ‘కాడా’ కమిషనర్‌ డాక్టర్‌ మల్సూర్, సీఈలు శంకర్, హరిరామ్, ఖగేందర్‌ సుధాకర్, శ్యామసుందర్, సురేశ్, మధుసూదన్‌ పాల్గొన్నారు.గ్రామ పంచాయతీలుగా ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలు!

ప్రతి ప్రాజెక్టు కింద నిర్ధారిత ఆయకట్టు లక్ష్యాల సాధనకు పకడ్బందీ ప్రణాళికలు రచించి అమలు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నిర్వాసి తుల కోసం నిర్మించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను గ్రామ పంచాయతీలుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రధాన కాలువ తోపాటు డిస్ట్రిబ్యూటరీలు, ఉప కాలువలను ఇరిగేషన్‌ ఇంజనీర్లు తనిఖీ చేసి లీకేజీలుంటే యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top