రైతులకు ఊరట

Kharif Crop Season Water Release Farmers Happy - Sakshi

అమరచింత: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మొత్తం 17 తాగునీటి పథకాలకు గాను 16 రక్షిత పథకాలకు తాగునీటి కష్టాలు తప్పనున్నాయి. ఆల్మట్టి నుంచి జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీరు వచ్చిచేరుతుండటంతో దీనిపై ఆధారపడిన రక్షిత పథకాలకు ఊరట కలిగింది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ నుంచి 150 క్యూసెక్కుల నీటిని రామన్‌పాడు రిజర్వాయర్‌కు పీజేపీ అధికారులు వదిలారు.

ఇది వారంరోజుల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు. జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు అనుసంధానంగా ఉన్న పస్పుల, పారేవుల, జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న సత్యసాయి రక్షిత పథకాలకు నెలరోజుల క్రితం ఇంటేక్‌ వెల్‌కు అందకపోవడంతో మోటార్లు బిగించి ఆయా గ్రామాలకు తాగునీరు అందించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో ఉన్న ఆల్మట్టి డ్యాం నుంచి 15రోజుల క్రితం 2.5 టీఎంసీల నీరు వదలడంతో నారాయణ్‌పూర్‌ డ్యాంకు చేరింది. అక్కడి నుంచి నాలుగు రోజులుగా ప్రియదన్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తోంది.

ముఖ్యమంత్రి చొరవతో..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్ణాటక సీఎం కుమారస్వామితో జరిపిన చర్చల కారణంగా ఆల్మట్టి నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీరు వచ్చి చేరుకుంటోంది. వాస్తవానికి సుమారు 400 గ్రామాలు రామన్‌పాడు, సత్యసాయి వాటర్‌ స్కీంలతో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. వేసవిలో జూరాల డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో సత్యసాయి రక్షిత పథకం కొన్నిరోజులు నిల్చిపోయింది.

చివరకు జూరాలలో మోటార్లను దింపి సత్యసాయి రక్షిత పథకాలకు తాగునీటిని అధికారులు అందించగలుగుతున్నారు. పరిస్థితి ఇలాఉంటే వేసవిలో ప్రజలకు తాగునీరు అందించలేకపోతామని ఆర్‌డబ్ల్యూఎస్, పీజేపీ అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతీసుకోవడంతో జూరాలపై ఆధారపడిన రక్షిత పథకాలకు తాగునీటి కష్టాలు తీరినట్టేనని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జూరాల బ్యాక్‌వాటర్‌లో నీటిమట్టం అడుగంటగా.. నేడు ఆల్మట్టి నుంచి వచ్చి చేరుతున్న నీటితో జలాశయం కళకళలాడుతోంది.

మోటార్ల తొలగింపు
ఆత్మకూర్‌: జూరాల ప్రధాన ఎడమకాల్వ పరిధిలో 17కిలోమీటర్ల వరకు రైతులు ఏర్పాటుచేసుకున్న మోటార్లు, స్టాటర్లు, ఫ్యూజులను శుక్రవారం పీజేపీ ఏఈ వసంత, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు లక్ష్మయ్యగౌడ్, వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తొలగించారు. తాగునీటి అవసరాల నిమిత్తం రామన్‌పాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తున్నందున రైతులు సంపూర్ణంగా సహకరించాలని వారు కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top