
యూటీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి, కలెక్టర్ అనుదీప్
హాజరుకానున్న ఉప ముఖ్యమంత్రి భట్టి
పాలేరు వద్ద పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని సాగర్ ఆయకట్టు(రెండో జోన్‌కు) సోమవారం సాగునీటిని విడుదల చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు వద్ద ఎడమ కాల్వకు చేపట్టిన యూటీ నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి ఆదివారం రాత్రి పరిశీలించారు. సోమవారం ఉదయమే 1,300 క్యూసెక్కుల నీటి విడుదలకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ డీఈఈ మాధవిని ఆదేశించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు హాజరవుతానని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గత సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలకు పాలేరు వద్ద ఎడమ కాల్వ యూటీ కొట్టుకుపోయిందని, ఈ ప్రాంతాన్ని అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారని గుర్తు చేశారు. సీఎం సూచనలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో.. రూ.14.20 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన యూటీ, కాలువ మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో.. అనుకున్న సమయానికంటే ముందే రైతులకు సాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.