
శ్రీశైలం ప్రాజెక్టుకు 2,73,659 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సాగర్‌లో 26 గేట్ల నుంచి నీటి విడుదల
దోమలపెంట/నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో 2,73,659 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా 1,79,316 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 25,205, సుంకేసుల నుంచి 69,138 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దీంతో ఎనిమిది గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 2,16,152 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,764 క్యూసెక్కులు.. మొత్తం 66,079 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.7 అడుగుల నీటిమట్టం వద్ద 202.9673 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 31,000 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్‌ఐకి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు
ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వస్తున్న నీటితో.. సాగర్ నుంచి 26 క్రస్ట్‌గేట్ల ద్వారా, విద్యుదుత్పాదనతో కలిపి మొత్తం 2,25,595 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 585 అడుగులు (297.4350టీఎంసీలు) ఉంది.