ఖరీఫ్‌కు సిద్ధం

Kharif Crop Season All Arrangements Complete - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఖరీఫ్‌ సాగుకు ఇటు రైతులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొన్నిరోజులుగా అధికారులు తలమునకలై కాస్త ఆలస్యంగానైనా ప్రణాళిక తయారు చేశారు. ఒకవైపు రైతు సమగ్ర సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగిస్తూనే ఖరీఫ్‌ కోసం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉం చేందుకు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 15,977 క్వింటాళ్ల మేర విత్తనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆశల సాగుకు 
జూన్‌లోనే నైరుతీ రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు పొలం పనులను మొదలెట్టారు. అలాగే  అధికారులు 2019 ఖరీఫ్‌ సాగుపై ప్రణాళిక సిద్ధం చేశారు. రాబోయే ఖరీఫ్‌ సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా రబీలో సేద్యపరంగా వచ్చిన లాభనష్టాలను పక్కకుపెట్టి రైతన్న మళ్లీ అదృష్ట పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగుకు  శ్రీకారం చుట్టడానికి రైతులు సరంజామ సిద్ధం చేసుకున్నారు. సిప్పటికే పొలాలను వేసవి దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు.
 
జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లు  
జిల్లాలోని 15 మండలాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో 1.25 లక్షల హెక్టార్లు సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 17,211 హెక్టార్లు, జొన్నలు 8,500 హెక్టార్లు, మొక్కజొన్న 39,000 హెక్టార్లు, రాగులు 600 హెక్టార్లు, కందులు 12,000 హెక్టార్లు, పత్తి 38,000 హెక్టార్లతో పాటు పలు రకాల చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరిసాగు కోసం 10,435 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు.

వరి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర, ఆముదం, వేరుశనగ, మినుములు, పత్తి పంటలకు ప్రాధాన్యం ఇస్తూ సాగు కోసం ప్రణాళికలు రూపొందించారు. రైతులకు అవసరమయ్యే సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు వీలుగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ప్రధానంగా వరి, పత్తి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి పంటల వివరాలు, భూమి స్వభావం వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతులు, బోరుబావుల కింద వ్యవసాయ సాగు ఎకరాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు.

1,35,322 మెట్రిక్‌ టన్నుల ఎరువులు 
ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లాలోని రైతాంగానికి 1,35,322 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 61,342 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 25,206 మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌ 7,222 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 38,612 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2,940 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. 

అవసరం మేరకు తెప్పిస్తాం 
జిల్లాలోని రైతులకు అవసరం మేరకు విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వారం పది రోజుల్లో అన్ని మండల కేంద్రాలకు విత్తనాలను పంపిస్తాం. ఎరువులు కూడా సాగుకు అవసరమయ్యే మేర కు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువుల విషయమై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేను. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ,అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top