మారడోనాతో మళ్లీ వస్తా..

Kerala businessman Bobby Chemmanur promoting jail tourism - Sakshi

     ‘ఫీల్‌ ది జైల్‌’ గొప్ప అనుభూతి 

     జైలు టూరిజంపై ప్రచారం చేస్తా 

     కేరళ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు 

     సంగారెడ్డి జైలు నుంచి విడుదల

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాల జీవన శైలి కలిగిన నేను.. కటిక నేలపై నిద్రించా.. సాధారణ ఖైదీలకు అందించే రొట్టె, పప్పు మాత్రమే నాకూ అందించారు. దోమలు కుట్టినా, జైలు సిబ్బంది అందించిన కంబలి, ఖైదీలు వేసుకునే దుస్తులు సౌకర్య వంతంగానే ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం వింత అనుభూతినిచ్చింది’ అని కేరళకు చెందిన వ్యాపార దిగ్గజం బాబీ చెమ్మనూరు తన ‘ఫీల్‌ ది జైల్‌’ అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. కేరళ త్రిసూరుకు చెందిన చెమ్మనూరు ఇంటర్నేషనల్‌ జ్యువెలర్స్‌ చైర్మన్‌ బాబీ చెమ్మనూరు సంగారెడ్డి ‘హెరిటేజ్‌ జైలు మ్యూజియం’ ఆవరణలో జైళ్ల శాఖ నిర్వహిస్తున్న ‘ఫీల్‌ ది జైల్‌’లో భాగంగా ఒక రోజు పాటు జైలులో గడిపారు.

సోమవారం ముగ్గురు మిత్రులతో కలసి సంగారెడ్డి పాత జైలుకు వచ్చిన ఆయన రూ.500 చొప్పున నలుగురికి రూ.2 వేలు రుసుము చెల్లించారు. జైలు నిబంధనల మేరకు సాధారణ ఖైదీల తరహా లో చెమ్మనూరు బృందం ఒక రోజు జైలు జీవితాన్ని అనుభవించి మంగళవారం విడుదలయ్యారు. 24 గంటల పాటు తాను అనుభవించిన జైలు జీవితంపై ‘సాక్షి’తో మాట్లాడారు. తన వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మార డోనా త్వరలో కేరళ పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరోసారి వచ్చి సంగారెడ్డిలో ‘ఫీల్‌ ది జైల్‌’ను అనుభూతి చెందాలనుకుంటున్నట్లు తెలిపారు.

అమెరికా, గల్ఫ్, మలేసియా తదితర దేశాల్లో ‘జైలు టూరిజం’ను ప్రోత్సహించేలా ప్రచారం నిర్వహిస్తానన్నారు. సంగారెడ్డి జైలు మ్యూజియాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సహకారం అందిస్తానన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక చెమ్మనూరు తన మిత్ర బృందంతో కలసి సాధారణ వ్యక్తిలా ఆటోలో తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఫీల్‌ ది జైలుకు ఆదరణ పెరుగుతోందని జిల్లా జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌రాయ్, జైలు అధికారులు వెంకటేశ్, గణేశ్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top