గులాబీసేన వాట్సాప్‌! | Kcr Warns TRS Leaders | Sakshi
Sakshi News home page

గులాబీసేన వాట్సాప్‌!

Mar 8 2018 2:00 AM | Updated on Jul 27 2018 1:16 PM

Kcr Warns TRS Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రులు, ఇతర కీలకమైన పదవుల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఏ క్షణమైనా రంగంలోకి దిగే అవకాశముందని, ఏ చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త పడాలని సూచించినట్లు సమాచారం. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని స్పష్టం చేశారని... మంత్రులు, ఇతర ముఖ్యస్థానాల్లో ఉన్నవారెవరైనా కాపాడుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

సీఎం కేసీఆర్‌ ఆరేడు నెలల కింద ఇదే విషయంపై మంత్రులు, ఇతర ముఖ్య పదవుల్లో ఉన్నవారిని హెచ్చరించారని సమాచారం. అయినా ఇద్దరు, ముగ్గురు మంత్రుల వ్యవహారశైలిలో మార్పురాకపోవడంతో ఇటీవల మరోసారి హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేవలం రాజకీయాలు, పరిపాలనా వ్యవహారాల్లోనే కాకుండా.. వ్యక్తిగత వ్యవహారాలు, భూ తగాదాలు వంటి విషయాల్లోనూ టీఆర్‌ఎస్‌ నేతలు అప్రమత్తమయ్యారు. వ్యక్తిగత, పరిపాలన, రాజకీయ వ్యవహారాల్లో అవినీతి, అవకతవకలు, నేరారోపణల కేసులు, ఐటీ సహా పన్నుల బకాయిలేవీ లేకుండా చూసుకుంటున్నట్టు తెలిసింది.

చిన్న తప్పు జరిగినా కాపాడుకోలేను..
‘‘కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి దిగుతున్నాం. కేంద్ర ఆధీనంలో ఐటీ, ఈడీ వంటి కీలకమైన దర్యాప్తు సంస్థలున్నాయి. ఈ కీలకమైన సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా అడ్డంగా దొరికిపోతాం. తప్పు చేసి దొరికిపోతే మన నాలుక కింద ముల్లున్నట్టు అవుతుంది. ఎవరు తప్పు చేసినా అందరికీ అంటుతుంది.

గతంలో తెలిసో, తెలియకో ఏమైనా జరిగితే దిద్దుకోండి, భవిష్యత్తులో చేయకుండా ఒళ్లు దగ్గరపెట్టుకోండి. తరువాత ఏం జరిగినా నేను కూడా కాపాడుకునే పరిస్థితి ఉండదు..’’అని నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రధాని మోదీపై, బీజేపీపై గట్టిగా పోరాడుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి అదే స్థాయిలో రాజకీయ ప్రతిఘటన ఎదురవుతుందని అంచనా కేసీఆర్‌ వేస్తున్నారు. అందువల్ల టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

అంతా వాట్సప్‌లోనే..
మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులంతా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవడానికి జంకుతున్నారు. ఎవరితో, ఏం మాట్లాడితే ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ వ్యూహాలను, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఫోన్లను ట్యాప్‌ చేసే అవకాశముందని, అందుకు ఆస్కారమివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఫోన్‌కాల్స్‌ కాకుండా.. కేవలం వాట్సాప్‌ ద్వారా కాల్స్‌ చేసి మాట్లాడుకుంటున్నారు. ఏదైనా రహస్యంగా చెప్పాల్సిన విషయముంటే వాట్సాప్‌ కాల్‌ చేయాలని సూచిస్తున్నారు. వాట్సాప్‌ కాల్స్‌ను రికార్డు చేసే అవకాశం, ట్యాప్‌ చేసే అవకాశం లేదన్న ధీమాతోనే ఈ వ్యూహాన్ని పాటిస్తున్నారు.
 
రాష్ట్రంపై కేంద్రం నజర్‌!
ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన వెలువడినప్పటి నుంచే కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌కు సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో ఫోన్‌ సంభాషణలు, నేతల భేటీలు, రాజకీయ సమాలోచనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. కీలకమైన విషయాల్లో గోప్యత పాటించాలని పార్టీ శ్రేణులకు గులాబీ అధినేత హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది.
 
పలువురు మంత్రులపై సీరియస్‌
ఇద్దరు, ముగ్గురు మంత్రుల వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ అయినట్టు తెలిసింది. గతంలోనే హెచ్చరించినా మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి చేస్తున్న సెటిల్‌మెంట్లు శ్రుతి మించుతున్నాయని హెచ్చరించినట్లు తెలిసింది. రాజధాని సమీప జిల్లాకు చెందిన మరో మంత్రి వ్యక్తిగత జీవనశైలిపైనా కేసీఆర్‌ సీరియస్‌ అయినట్టు సమాచారం. ఇక ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న కొందరి తీరును కూడా కేసీఆర్‌ తప్పుపట్టినట్టు తెలిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement