ఒక నది పారినట్టు..!

KCR Visits Kaleshwaram Lift Irrigation Project - Sakshi

గోదావరి నుంచి రోజుకు 3టీఎంసీలు తరలింపుపై సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం, మేడిగడ్డల వద్ద ప్రాజెక్టు పనులతీరు పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌/వరంగల్‌: గోదావరి నది నుండి రోజుకు 3టీఎంసీల నీటిని తరలించడం అంటే తెలంగాణ ప్రాంతానికి ఒక నది తరలి వస్తున్నట్లే అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 45లక్షల ఎకరాలకు సాగు నీరందించే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనలో భాగంగా ఆదివారం ఉదయం కాళేశ్వరముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నేపల్లి పంప్‌ హౌస్‌ పనులను పరిశీలించారు. పంపుహౌస్‌లోపలకు లిఫ్ట్‌ ద్వారా దిగి మోటార్ల పంపింగ్‌ పనితీరు గురించి ఇంజనీర్లను, కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం ఎంత ముఖ్యమో.. ప్రాజెక్ట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కూడా అంతే ముఖ్యమన్నారు. వచ్చే జూలైలోనే 2 టీఎంసీల చొప్పున నీటిని తరలించి సాగునీరు అందించేందుకు అంతా సిద్ధమవుతుండటం శుభపరిణామమని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు వీలుగా పనుల్లో వేగం పెంచాలని ప్రాజెక్టు ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీలకు కేసీఆర్‌ సూచించారు. ఇంత పెద్ద సాగునీటి ప్రాజెక్ట్‌ కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయని వాటిని పకడ్బందీగా పరిష్కరించి ప్రాజెక్ట్‌ నిర్వహణకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, వర్కింగ్‌ ఏజెన్సీలకు సూచించారు.  

క్వాలిటీలో కాంప్రమైజ్‌ వద్దు 
పనులు వేగంగా జరగాలనే తొందరలో ప్రాజెక్ట్‌ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, కొద్ది సమయం తీసుకున్నా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సరఫరా మోటార్ల బిగింపు సహా మొత్తం అన్ని విభాగాల్లో చెక్‌ లిస్ట్‌ పూర్తి అయిన తరువాత ట్రయల్‌ రన్‌ ప్రారంభానికి తాను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి వస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియ జూన్‌ చివరి వరకు పూర్తి చేయాలని సూచించారు. కాళేశ్వరం నుండి మిడ్‌మానేరు వరకు ఫేస్‌–1 గా , మిడ్‌మానేరు నుండి ఫేస్‌–2 గా పరిగణించి ప్రాజెక్ట్‌ పూర్తికి సమయానుగుణంగా పనులు చేయాలని ఆదేశించారు. పంప్‌హౌస్‌లు సహా ఇతర ప్రాజెక్ట్‌ ఆపరేషన్‌ విషయంలో ఇండిపెండెంట్‌ వైర్‌లెస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టులో పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేస్తున్నందున అన్ని పంప్‌ హౌస్‌ల వద్ద మోటార్లకు అందే నీటిలోకి కలప చెట్లు వంటివి వెళ్లకుండా ముందుగానే జాలి తరహాలో ఉండే ట్రాష్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌ పనుల ప్రాధాన్యతలో భాగంగా ముందు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూ, వచ్చే ఏడాది 3టీఎంసీల నీటిని ఎత్తి పోసే పనులను కొనసాగించాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులకు, వర్కింగ్‌ ఏజెన్సీతో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 

మండుటెండలో సుడిగాలి పర్యటన 
కన్నేపల్లి పంప్‌ హౌస్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా హెలికాప్టర్‌ ద్వారా మేడిగడ్డకు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన బ్యారేజ్‌ పనులను పరిశీలించారు. వ్యూ పాయింట్‌ వద్ద పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, వర్క్‌ ఏజెన్సీ ఎల్‌అండ్‌టీ బాధ్యులను కోరారు. పని వేగంగా పూర్తయ్యేందుకు అవసరమైన వెల్డర్లు, ఫిట్టర్లు తదితర సిబ్బందిని దేశంలో ఎక్కడినుంచయినా తక్షణమే తెప్పించి పనులను వేగవంతం చేసేందుకు సహకరించాలని మేఘా కృష్ణారెడ్డిని సీఎం కోరారు. గేటు గేటుకూ సరిపోను సిబ్బందిని దించి మూడు షిఫ్టుల్లో పనిచేయించాలన్నారు. అక్కడనుంచి వాహనంలో బ్యారేజ్‌ మీద నుంచి ప్రయాణిస్తూ.. మధ్యలో ఆగిన సీఎం బ్యారేజ్‌ నిర్మాణం, గేట్‌ల బిగింపు, తదితర పనులను పరిశీలించారు. గోదావరి ఈ వైపునుంచి అవతలి వైపు (మహారాష్ట్ర సరిహద్దు వైపునకు) వరకు తిరిగి.. వాగు మళ్లింపు కాల్వ నిర్మాణం, మిగిలిన కొన్ని గేట్‌ల బిగింపునకు సంబంధించి సూచనలు చేశారు. అక్కడ నుంచి 45 డిగ్రీల ఎండలోనే వాహనంలో బయలుదేరిన కేసీఆర్‌ గోదావరి నీటి కోతను తట్టుకునేందుకు అంచులకు నిర్మిస్తున్న కరకట్టల నిర్మాణ పనులను పరిశీలించారు. బ్యారేజ్‌ కింది కాఫర్‌ డ్యామ్‌ మీదుగా గుంతల రోడ్డులోనే వెళ్లి.. అక్కడ పనిచేస్తున్న కార్మికులను పలకరించారు. ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. గెస్ట్‌హౌస్‌ చేరుకున్న తర్వాత ఇంజనీర్లతో సమావేశమై.. రానున్న జూన్‌లో వచ్చే గోదావరి వరదను మేడిగడ్డ వద్ద నిలువరించేందుకు చేపట్టాల్సిన సత్వర చర్యలను.. అందుకు తగిన పలు సూచనలను చేశారు. 

ముక్తేశ్వర ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు 
గోదావరి తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వెంటనే రూ.100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఆలయ అర్చకులతో కాసేపు కూర్చొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రాముఖ్యత దృష్ట్యా ఇక నుండి ఆలయానికి, ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వస్తారని, దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, అటవీ స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపంతో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించాల్సి ఉంటుందన్నారు. అర్చకుల కోసం క్వార్టర్స్‌ నిర్మిస్తామని, వేద పాఠశాల, కళాశాలతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కర ఘాట్స్‌ దగ్గర జాలీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

మహోత్తర యాగం యోచన 
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహోత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు సీఎం తెలిపారు. యజ్ఞ యాగాదులకు గోదావరి తీరంలోని ఆలయ ప్రాంతం అణువుగా ఉంటుందని, ఆలయ పునర్నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామిని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలన్ని పూర్తయిన తరువాత గోదావరి జలాలు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి పాదాలను తాకే వరకు సుమారు 170 కిలోమీటర్లు నిలిచి ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భానుప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, కలెక్టర్లు వెంకటేశ్వర్లు, దేవసేన, కరీంనగర్‌ జెడ్పీ చైర్మన్‌ తుల ఉమ, కార్పొరేషన్ల చైర్మన్లు దామోదర్‌రావు, ఈద శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top