చంద్రబాబుతో పొత్తా.. ఛీ..ఛీ : కేసీఆర్‌

KCR Speech In Wanaparthy Meeting - Sakshi

చంద్రబాబుది ఐరన్‌లెగ్‌

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు

తెలంగాణ నీళ్లను దోచ్చకున్న పార్టీలతో పొత్తా..

వనపర్తి బహిరంగ సభలో కేసీఆర్‌

సాక్షి, వనపర్తి : కాంగ్రెస్‌,టీడీపీ పార్టీల 60 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా మార్చడమే  కాకుండా వలసల జిల్లాగా మార్చారని ఆపధర్మ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణ ప్రజలు 18 ఏళ్లు పొరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మనమే పాలించుకోవాలని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రజా ఆశీర్వాద సభ లో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో మాట్లాడిన కేసీఆర్‌.. పాలమూరు జిల్లాలో వలసలు, కరువు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవని.. ఎన్నో సవాళ్లు నడుమ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు పాలమూరు జిల్లా అభివృద్ధిలో నడుస్తోందని అన్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్‌-టీడీపీల పొత్తుపై కేసీఆర్‌ మండిపడ్డారు. ‘చంద్రబాబుతో పొత్తా.. ఛీ..ఛీ. చంద్రబాబు ఎక్కడ కాలుపడితే అక్కడ పచ్చని చెట్లు కూడా భస్మం అయిపోతాయి. చంద్రబాబు ఒక ఐరన్‌ లెగ్‌. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఆడియో టేపింగ్‌లో దొరికింది నీ వాయిస్‌ కాదా? నీతో పొత్తా అది బతికుండగా జరగదు’ అంటూ విమర్శించారు. 

పాలమూరు ప్రాజెక్టులకు రావాల్సిన నీళ్లను ఆంధ్రా టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు దోచుకుపోతుంటే ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు వారికి గులాములుగా మారారని మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న జిల్లాను పట్టించుకోకుండా ఇక్కడ మంత్రిగా ఉన్న చిన్నారెడ్డి చిల్లర మంత్రి పదవి కోసం ఆంధ్రా వారికి తొత్తుగా మారారని మండిపడ్డారు. పొతిరెడ్డిపాడు ద్వారా నీళ్లను దోచుకుని పోతుంటే కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ సిగ్గులేకుండా వారికి హారతిపట్టారని విమర్శించారు.

మీ బండారం బయటపెడతాం..
సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో వెనుకబడిన యాదవులకు గొర్రెలు పంచుకుంటే గొర్రెలాంటి కాంగ్రెస్‌ నేతలు చిన్నచూపుచూశారు. రాష్ట్రంలో అనేక కులాలను ఆదుకున్నాం. దేశంలోనే నెంబర్‌ వన్‌ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నాం. 17 వేల కోట్లతో రైతు రుణమాఫీ పూర్తి చేశాం. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణలో కరెంట్‌ కష్టాలు వస్తామని శాపనార్థాలు పెట్టిండు. కానీ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాకా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రంగా దేశంలో రికార్డు సృష్టించాం. కాంగ్రెస్‌ నాయకులు నిన్న గద్వాల వచ్చి కత్తులు తిప్పారు. పల్లీలు అమ్మూకునేంత జనం కూడా రాలే వారి మీటింగ్‌కు. డీకే అరుణా మాకే సవాలు విసిరారు. ప్రజల్లోకి వెళ్లి మీ బండారం ఏంటో బయటపెడతాం. మీ చరిత్ర అంతా బయటకు తీస్తాం. వెనుకబడ్డ పాలమూరును ఆదుకునేందుకు ఇక్కడ ప్రాజెక్టుల వద్ద కుర్చీలు వేసుకుని పని చేయించాం. ఉమ్మడి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. ప్రాజెక్టులు పూర్తి అయితే 20 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

బాంబులు వేస్తామని బెదించారు..
సభలో ప్రసంగం కొనసాగిస్తూ.. ‘‘1978లోనే బచావత్‌ ట్రిబ్యునల్‌ పాలమూరుకు నీళ్లు ఇవ్వాలని ఆదేశించింది. ఐనా కానీ కాంగ్రెస్‌ నేతలు ఇవ్వలేదు. ఫలితంగా కరువు, వలసలు ఏర్పడ్డాయి. పొతిరెడ్డిపాడు, సుంకేసులు, ఆర్డీఎస్‌ వల్ల మనం తీవ్రంగా నష్టపోయాం. గతంలో తూములు పగలకొట్టి నీళ్లు తీసుకుపోతామని కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి మమ్మల్ని హెచ్చరించారు. పాలమూరుకు నీళ్లు ఇవ్వకపోతే లక్షల మందితో వచ్చి సుంకేసుల బ్యారేజీపై బాంబులు వేస్తామని నేనే బెదిరించాను. వారిని ధైర్యంతో ఎదుర్కొని కేంద్రంలో పోరాడి జిల్లాకు నీరు తెప్పించాం. జూరాల ప్రాజెక్టు పూర్తి అయినా కూడా 2001 వరకు చంద్రబాబు నాయుడు నీళ్లు నిపంలే. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడిన తరువాత చంద్రబాబుతో కొట్లాడి నీళ్లు తెచ్చుకున్నాం. కల్వకుర్తిపై మరో 40 రిజర్వాయర్లను నిర్మిస్తాం.  ఇంటింటికి నీళ్లు ఇచ్చే మిషన​ భగీరథ 99శాతం పూర్తి అయ్యింది. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డ చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు ఎంత అనైతికంగా. తెలంగాణ అభివృద్ధికి నిరంతరంగా పోరాడుతున్న టీఆర్‌ఎస్‌ నేతలకు ఓటు వేయ్యండి. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ను 14 సీట్లలో గెలిపించాలి’’ అని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top