మాంద్యం కోతేస్తది | KCR Says Keep In Mind Economic Slowdown While Drafting Telangana Full Fledged Budget | Sakshi
Sakshi News home page

మాంద్యం కోతేస్తది

Aug 27 2019 2:38 AM | Updated on Aug 27 2019 10:24 AM

KCR Says Keep In Mind Economic Slowdown While Drafting Telangana Full Fledged Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా పలు రంగాలపై కనిపిస్తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఇది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధుల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని సర్కారు ఆందోళన చెందుతోంది. ఖజా నాపై ఇప్పటికే ఆర్థిక మాంద్యం ప్రభావం కనపడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. ఆశించిన మేరకు ఆదాయం రాకపోవ డంతో కొన్ని ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులు మినహా మిగిలినవాటికి బడ్జెట్‌లో భారీగా కోతలు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన జరగాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తాజాగా అధికారులను ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

బడ్జెట్‌ రూపకల్పనపై సోమవారం ఆయన ప్రగతి భవన్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు బి.వినోద్‌ కుమార్, ఇతర సీనియర్‌ అధికారులతో కసరత్తు ప్రారం భించారు. ఈ ఏడాది మార్చిలో ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు. ‘‘దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. ఆదాయాలు బాగా తగ్గిపోయాయి.

అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం–అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్‌ రూపకల్పన జరగాలి. వాస్తవ దృక్పథంతో బడ్జెట్‌ తయారు చేయాలి. ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలి’’అని సీఎం కేసీఆర్‌ సూచించారు. బడ్జెట్‌ రూపకల్పనపై మంగళవారం కూడా కసరత్తు జరగనుంది. దీనికి తుదిరూపం వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం, అసెంబ్లీని సమావేశపరిచి, బడ్జెట్‌ ప్రతిపాదించడం తదితర ప్రక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

భారీ కోతలు ఖాయం..
ఆర్థిక మాంద్యం ప్రభావం నేపథ్యంలో గత కొన్నేళ్ల రాబడుల లెక్కలపై ప్రభుత్వం దృష్టిసారించింది. గత ఐదేళ్లుగా రాష్ట్రానికి వచ్చిన రాబడులు, బడ్జెట్‌ కేటాయింపులపై అధ్యయనం జరుపుతోంది. రాష్ట్ర ఆదాయవృద్ధి రేటు సరళిపై అంచనా వచ్చిన తర్వాతే బడ్జెట్‌ కేటాయింపులు చేయాలని భావిస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే త్వరలో ప్రవేశపెట్టబోతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ కేటాయింపుల్లో భారీ కోతలు ఖాయమని తెలుస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు మాత్రం రూ.10 వేల కోట్ల వరకు ప్రత్యేక కేటాయించే అవకాశముంది. కాగా, బడ్జెట్‌ రూపకల్పన కసరత్తు ఇప్పుడే ప్రారంభించామని, మరో వారం రోజుల పాటు సీఎం కేసీఆర్‌ వరుస సమీక్షలు నిర్వహించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం జరిగిన కసరత్తులో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. 

రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి తీవ్రం..
ప్రభుత్వం గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడున్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందని, గత 70 ఏళ్లలో ఎన్నడూ ఇంత తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని దేశం చూసి ఉండదని ఇప్పటికే నీతి ఆయోగ్‌ ప్రకటించింది. దేశ ఆర్థికాభివృద్ధి మందగిం చింది. అమ్మకాలు పడిపోయి ఆటోమొబైల్, రియల్‌ ఎస్టేట్, స్టీల్, వస్త్ర, ఆహార తదితర రంగాల పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించడంతో వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు రావా ల్సిన ఆదాయం సైతం తగ్గిపోయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే.. ఇటీవల ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించాల్సిన కేంద్ర ప్రన్నుల్లో రాష్ట్ర వాటాలో రూ.840 కోట్ల మేర కోత పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన గతంతో పోల్చితే ఈ ఏడాది మరింత సంక్లిష్టంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement