కల్తీ లేని సరుకులు, కూరగాయలు - సీఎం కేసీఆర్‌

KCR Said Public Distribution System Would Be Strengthen - Sakshi

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తాం

రేషన్‌ డీలర్ల వ్యవస్థను బలోపేతం చేస్తాం

త్వరలో ఖాళీలన్నీ భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా పంపిణీ వ్యవస్థను మహిళా సంఘాలతో అనుసంధానం చేసి బియ్యంతో పాటుగా ఇతర సరకులు, కూరగాయల్ని కల్తీ లేని పద్ధతుల్లో అందించే దానిపై మేథో మధనం చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. అసెంబ్లీలో బుధవారం పలు పద్దులపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం మాట్లాడారు. రేషన్‌ డీలర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, రెండుమూడు నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. డీలర్ల కమిషన్‌ పెంచా లని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు.

విదేశాలలో అధ్యయనం...
డీలర్ల వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మహిళా సంఘాలను కూడా క్రియాశీలకంగా మార్చి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ తీసుకు రావాల్సి ఉందని సీఎం తెలి పారు. మంత్రులు, కొందరు శాసన సభ్యులు, ఉన్నతాధికా రులతో ఏర్పాటైన బృందం ఐదారు దేశాలు తిరిగి అధ్యయనం చేయాలన్నారు. ఏది కొందామన్నా బజారులో కల్తీయేనని, మిరప పొడిలో రంపం పొట్టు కలుపుతున్నారన్నారు. ప్రజలకు నాణ్యమైన సరుకులు అందాలంటే కొత్త విధానానికి రూపకల్పన చేయాలన్నారు. ఒక వేదిక ఏర్పాటు చేయాల్సి ఉందని ఇది కొత్తగానే ఉంటుం దన్నారు. ఉన్న డీలర్‌ వ్యవస్థను పటిష్టం చేసుకో  వాలని, ఖాళీలను భర్తీ చేసుకోవడంతో పాటు వాళ్ల కమిషన్‌ కూడా పెంచాల్సి ఉందన్నా రు. మహిళా సంఘాలకు చిన్న చిన్న యూనిట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆలు పండే చోట చిప్స్‌ తయారీ చేయడం, పెరుగు తయారు చేసి అమ్మడం వంటి వి చేయాలన్నారు. అమూల్‌ చిన్న సంస్థ పెద్దగా అయిందని, విజయ డెయిరీని కొందరు దుర్మా ర్గులు చెడగొట్టారని సీఎం విమర్శించారు. బాంబే మార్కెట్‌లో విజయ నెయ్యికి డిమాండ్‌ ఇప్పటికీ ఉందన్నారు. డీలర్ల వ్యవస్థను, మహిళా సంఘాల ద్వారా చేసే తయారీ పద్ధతులను అనుసంధా నించేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు.

క్రియాశీలకంగా రైతు సమితి...
త్వరలో వ్యవసాయ మంత్రి నేతృత్వంలో రైతు సమన్వయ సమితులను వంద శాతం క్రియాశీలకం చేస్తామన్నారు. రైతు సమితి సభ్యులు సంపూర్ణమైన పాత్ర వహించే దిశకు తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా పండేది వరి, మొక్కజొన్న, పత్తి పంటలేనని, మిగతావి చిన్న విస్తీర్ణ పంటలేనన్నారు. వరి విస్తీర్ణం పెరుగుతోందని, ధాన్యం సేకరణ చాలెంజింగ్‌ టాస్క్‌ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని, అకున్‌ సబర్వాల్‌ బాగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధానాహారం అన్నమేనని, రొట్టె తినేవారు కూడా అన్నం తింటారన్నారు. 20 నుంచి 25 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇక్కడే వినియోగం అవుతుం దన్నారు. పౌరసరఫరాల మంత్రి చెప్పినట్లు ఇంకో 25 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా వస్తుందన్నారు. అంత మొత్తం కొనేందుకు సిద్ధంగా ఉంటున్నామని చెప్పారని, ఈ క్రమంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. మిర్చి కొన్నిసార్లు సమస్యను సృష్టిస్తుందన్నారు. మార్కెట్‌కు ఒకేసారి రావడం, నియంత్రణ లేకపోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అక్టోబర్‌ 15 తర్వాత తనతో పాటు జిల్లాల వారీగా మంత్రులు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలో ఆలోచిస్తామన్నారు. త్వరలో ఎమ్మెల్యేలతో మీటింగ్‌ పెట్టుకుని దీనిపై చర్చిస్తామన్నారు. కొందరు దుర్మార్గులు పాలు కూడా కల్తీ చేయడం బాధేస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పసిపిల్లలు తాగే పాలు కల్తీ చేసి సింథటిక్‌ మిల్క్‌ అమ్ముతున్నారని, ఇది చాలా దుర్మార్గమన్నారు. పీడీఎస్‌ వ్యవస్థ బలోపేతంతోనే ఇలాంటి వాటికి చరమగీతం పాడొచ్చన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top