భారీ సభకు గులాబీ ప్లాన్‌

KCR Meeting To Be Held In Bhongir - Sakshi

21న భువనగిరికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ

జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

నేడు నామినేషన్‌ వేయనున్న పైళ్ల శేఖర్‌రెడ్డి 

సాక్షి, యాదాద్రి : శాసనసభ ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గులాబీ పార్టీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన శైలీలో వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలతో క్యాడర్‌లో మరింత జోష్‌ పెంచడానికి సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి అసెంబ్లీతోపాటు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సభకు హాజరయ్యేలా షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. దీంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు కేసీఆర్‌ హాజరయ్యే సభలను భారీగా నిర్వహించాలనే తలంపుతో పక్కా ప్లాన్‌ చేసుకుంటున్నాయి. 
పక్కా వ్యూహంతో..
భువనగిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, మహాకూటమి, యువతెలంగాణ, సీపీఎం, సమాజ్‌ వాది, ఆప్, బీఎస్‌పీ వంటి పార్టీలతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుంచే ప్రధాన పార్టీలు తమ బల ప్రదర్శనతో సత్తాను చాటుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే నామినేషన్‌ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూడా 19వ తేదీన నామినేషన్‌ వేసే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీలు కూడా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి.  
నేడు పైళ్ల నామినేషన్‌..
భువనగిరి పట్టణం, భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాలతో కూడిన ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికలు పోటా పోటీగా జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌ 6 శాసన సభ రద్దు చేసిన సీఎం కేసీఆర్‌ ఆరోజే తమ పార్టీ అభ్య ర్థులను ప్రకటించడంతో తాజా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నా రు. ముందుగా అనుకున్న ప్రకారం నామినేషన్‌ దాఖలు చేసే చివరి రోజున భారీ జనసమీకరణ తో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ కేసీఆర్‌ ఎన్నికల బహిరంగ సభకు సైతం టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఊపుమీదున్న శ్రేణులకు  మరింత ఊపు తీసుకురా వడానికి సీఎం సభ ఉపయోగపడుతుందని అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నమ్మకంతో ఉన్నారు. గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నెల 21, 23 తేదీల్లో నిర్వహించనున్న ఎన్నికల సభల్లో భువనగిరి నియోజకవర్గం ఉంది. 21న దేవరకొండ, నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాల్లో, 23న తుంగతుర్తి, సూర్యాపేటల్లో కేసీఆర్‌ ఎన్నికల బహిరంగ సభలు జరుగుతాయి. నామినేషన్‌ కార్యక్రమంతోపాటు, బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేస్తామని టీఆర్‌ఎస్‌ నాయకుడొకరు సాక్షితో చెప్పారు.  
జనసమీకరణపై ప్రత్యేక దృష్టి..
19న నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతోనే ఎన్నికల సభలకు ప్రణాళికను సిద్ధం చేసిన కేసీఆర్‌ ఈనెల 21న భువనగిరిలో బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న శేఖర్‌రెడ్డి తన క్యాడర్‌ను కార్యక్రమం సక్సెస్‌ కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు తిరిగి అధికారంలోకి వస్తే చేపట్టే మేనిపెస్టోను ఈ బహిరంగ సభద్వారా గులాబీ దళపతి ప్రజలకు వివరించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం మరింత క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రతి గ్రామం నుంచి క్యాడర్‌ను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే కొంగర కలాన్‌ ప్రజా ఆశీర్వాద సభ, నల్లగొండలో కేసీఆర్‌ సభలకు జనం భారీగా తరలివచ్చారు. ఈ అనుభవాలతో భువనగిరిలో జరగబోయే సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు సన్నాహాల్లో తలమునకలయ్యారు. దీంట్లోభాగంగా టీఆర్‌ఎస్‌ నాయకులు బహిరంగ సభ జరిగే జూనియర్‌ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. వీరితోపాటు హెలిపాడ్‌ స్థలాన్ని డీసీపీతోపాటు సీఎం సెక్యూటిటీ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. 
కళాశాల మైదానం పరిశీలన..
భువనగిరిలో సీఎం కేసీఆర్‌ ఎన్నికల సభ నిర్వహించే స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానాన్ని ఆదివారం పోలీసులు పరిశీలించారు. సీఎం భద్రతా అధికారులు, స్థానిక పోలీసులు, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం హాజరవుతారని, ఇందుకోసం జిన్నింగ్‌ మిల్‌ వద్ద హెలిపాడ్, కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ సభ జరుగుతుందని భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి సాక్షితో చెప్పారు. భద్రతా పరమైన ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్‌ సభస్థలాన్ని పరిశీలించిన అధికారులు 

భువనగిరిఅర్బన్‌ : ఈ నెల 21న భువనగిరిలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే  బహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రానున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ను భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి,  ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఫైర్‌స్టేషన్‌ అధికారులు పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి పట్టణ శివారులో ఉన్న భువనగిరి శివారులోని జిన్నింగ్‌ మిల్లు సమీపంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌ ల్యాండింగ్‌ స్థలా న్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌ డబ్ల్యూ వెంకటేశ్వర్లు, ఫైర్‌స్టేషన్‌ జిల్లా అధికారి అశోక్, పట్టణ సీఐ వెంకన్న, ట్రాఫిక్‌ సీఐ ఈర్ల శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ జనార్దన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top