ఆశీర్వాద సభకు.. అంతా సిద్ధం! | KCR Election Meeting In Nalgonda | Sakshi
Sakshi News home page

ఆశీర్వాద సభకు.. అంతా సిద్ధం!

Oct 4 2018 9:39 AM | Updated on Oct 4 2018 9:39 AM

KCR Election Meeting In Nalgonda - Sakshi

సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న పల్లా, గుత్తా, వీరేశం, బండా, కంచర్ల, కర్నె, చాడ తదితరులు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. గురువారం నల్లగొండలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి ఎన్నికల బహిరంగ సభను నల్లగొండలో ఏర్పాటు చేసిన గులాబీ దళం.. అన్ని నియోజకవర్గాల నుంచి కలిపి కనీసం మూడు లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం నాలుగైదు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో  మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రచారం చేశారు. జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఇప్పటికే పది చోట్ల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులతో నిమిత్తం లేకుండా ఒక విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసింది.

ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అభ్యర్ధులకు ప్రచార సామగ్రిని కూడా పంపించింది. దీనిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్లో ఊపును తీసుకువచ్చేందుకు బహిరంగ సభ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ ‘ ప్రజా ఆశీర్వాద ’ సభలో ఆపద్ధర్మ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్‌ పాల్గొననుండడంతో గడిచిన నాలుగు రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు, పార్టీ నాయకులు సభా ప్రచారంలోనే మునిగిపోయి ఉన్నారు.

గులాబీ జెండాల రెపరెపలు
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బహిరంగ సభ ఖరారు కావడంతో పనిలో పనిగా సభ ప్రచారం కూడా మొదలు పెట్టిన నేతలను గ్రామ గ్రామాన పార్టీ ప్రచార సామగ్రితో హోరెత్తిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పాతిక వేల మందిని సమీకరించే యోచనతో నాయకులు ఏ చిన్న గ్రామాన్నీ విడిచిపెట్టడం లేదు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. నల్లగొండకు సమీపంలో ఉన్న నియోజకవర్గాలనుంచి బైక్‌ ర్యాలీలు, ఆటో ర్యాలీల ద్వారా సభాస్థలికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలలతో రహదారులను నింపేశారు. సభను విజయవంతం చేసేందుకు గడిచిన మూడు నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలో పలువురు నేతలు తిష్టవేసి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, స్థానిక అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి  నియోజకవర్గంలో ప్రచారంతోపాటు సభా ఏర్పాట్లలో మునిగిపోయారు. జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లా కేంద్ర సమీంలోనే.. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి పక్కనే సభా స్థలాన్ని ఎంపిక చేశారు. సభాస్థలం పక్కనే హెలిపాడ్‌ సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం 3 గంటలకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ సభా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలతో ఇబ్బందులు లేకుండా నియోకవర్గాల వారీగా పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.

సభా స్థలి పరిశీలన
నల్లగొండ రూరల్‌ : టీఆర్‌ఎస్‌ సభా స్థలిని శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌  బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి తదితరులతో కలిసి సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట రేఖల భద్రాద్రి, జి.వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్‌రెడ్డి, జెల్లా మార్కెండెయ, ఫరీద్, అభిమన్యు శ్రీనివాస్, జిల్లా శంకర్, మోహన్‌బాబు తదితరులు ఉన్నారు.

కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌
సభా స్థలానికి  50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ నుంచి సభా వేదిక వద్దకు సీఎం కేసీఆర్‌ను తీసుకెళ్లడానికి పోలీసులు సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.  పోలీస్‌ అధి కారులు దగ్గరుండి కాన్వాయ్‌ను పర్యవేక్షించారు. సీఎం ప్రత్యేక సెక్యూరిటీ సభా స్థలానికి చేరుకుని అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు.
 
ఇబ్బందులు తలెత్తకుండా చూడండి : కలెక్టర్‌  
సభకు సీఎం రాక సందర్భంగా ప్రొటోకాల్‌ ప్రకా రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సూచించారు. సభా స్థలంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. భద్రతా చర్యల గురించి ఎస్పీ, ఇతర అ ధికారులతో చర్చించారు. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. హైవేపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చే యడంతో పాటు ప్రయాణికులకు సూచనలు చేసేందుకు సహాయకులను నియమించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సభా వేదిక ముందు వీఐపీలు, ప్రముఖులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా సభ జరుగుతున్నంత సేపు సభపై నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement