లబ్ధిదారుల్లో ‘పింఛన్‌’ టెన్షన్‌

KCR Is Crucial In National Politics - Sakshi

సాక్షి, కథలాపూర్‌: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌.. ఆసరా పింఛన్‌ పథకాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్‌కు వయస్సును 57 ఏళ్లకు కుదిస్తామని ప్రకటించారు. కొత్త ప్రక్రియ ఏప్రిల్‌ నెల నుంచి అమలవుతుందని ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. కానీ ఏప్రిల్‌ నెల సమీపిస్తున్నప్పటికి అధికారులు అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు వరుసగా ఉండటంతో ఎన్నికల కోడ్‌ తో జాప్యమవుతుందని పేదలు నిరాశకు గురవుతున్నారు. పెరిగిన పింఛన్‌ వస్తుందో లేదోనని  అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన పింఛన్‌ను త్వరగా వర్తింపజేయాలనిలబ్ధిదారులు కోరుతున్నారు. 

మండలంలో 10 వేల మంది లబ్ధిదారులు..
మండలంలో 19 గ్రామాలలో అన్ని రకాల పింఛన్లు పొందుతున్న  4,982 మంది లబ్దిపొందుతున్నారు. అయితే పింఛన్‌ డబ్బులను రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో కొత్త విధానంలో పింఛన్‌ డబ్బుల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల హడావుడి ఉండటంతో పెరిగిన పింఛన్‌ డబ్బులు మంజూరయ్యేందుకు మరింత జాప్యం జరుగుతుందేమోనని లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. 

57 ఏళ్లకు కుదింపుతో 2,393 మందికి లబ్ధి
ఆసరా పింఛన్‌కు కొత్తగా కనీస వయస్సు అర్హతను 57 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ నిబంధనతో మండలంలోని 19 గ్రామాల్లో కొత్తగా 2,393 మందికి లబ్ధి చేకూరనుంది. 57 ఏళ్లకు పైబడినవారు సుమారు 11,341 మంది ఉన్నారు. 57 ఏళ్ల నిబంధన సైతం ఏప్రిల్‌ నెల నుంచి అమలు చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇవ్వడంతో ఆశావహులు ఏప్రిల్‌ నెల ఎప్పుడు వస్తుందా అంటూ ఆతృతగా ఎదిరిచూస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి కొత్త పింఛన్‌ ప్రక్రియను త్వరగా అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

నెలల తరబడి జాప్యం వద్దు
ఆసరా పింఛన్‌ 57 ఏళ్లకే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో పేదల్లో సంతోషం వ్యక్తమైంది. ఎప్పుడు వస్తాయోనని నెలల తరబడి ఎదిరిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఆసరా పింఛన్‌ డబ్బులను రెట్టింపు చేసి మంజూరు చేయాలి. 57 ఏళ్లున్న వారికి త్వరగా పింఛను మంజూరు చేయాలి. 
– ఎం.డీ సత్తార్, గంభీర్‌పూర్‌

ప్రతి నెల ఒకటో తేదీన అందించాలి
ఆసరా పింఛన్‌ డబ్బులు ప్రతి నెల ఒకటో తేదిన అందించాలి. పింఛన్‌ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో తెలియని పరిస్థితులున్నాయి. డబ్బులు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులపాలువుతున్నారు. ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ప్రతి నెల ఒకటో తేదిన పింఛన్‌ డబ్బులు మంజూరు చేయాలి. 
– గుగ్లొత్‌ రవినాయక్, దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షుడు

ప్రభుత్వ ఆదేశాలు రాగానే అమలు 
ఆసరా పింఛన్‌ డబ్బులను పెంచడంతోపాటు 57 ఏళ్లకు ఆసరా పింఛన్‌ మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. గతంలో మంజూరైన పింఛన్లు యథావిధిగా లబ్ధిదారులకు అందుతున్నాయి. కొత్త విధానం అమలు చేయాలంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంటుంది. 
– కట్కం ప్రభు, ఎంపీడీవో, కథలాపూర్‌  
 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top