గురుకులాలకు ‘కేసీఆర్‌ కాస్మెటిక్‌ కిట్లు’

'KCR cosmetic kits' to Gurukulas - Sakshi - Sakshi

కాస్మెటిక్‌ చార్జీలకు బదులుగా కిట్ల పంపిణీ

ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థులకు అందజేత

నెలాఖరులోగా అన్ని గురుకులాలకు చేరనున్న కోటా

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త. ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్న కాస్మొటిక్‌ చార్జీల సమస్యకు ప్రభుత్వం పరిష్కారాన్నిచ్చింది. ఇప్పటివరకు ఇస్తున్న కాస్మొటిక్‌ చార్జీలకు బదులుగా వస్తువులు సరఫరా చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు త్వరలో సాంఘిక సంక్షేమ గురుకులాలతో పాటు గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఒకే తరహా కాస్మొటిక్‌ వస్తువులను సరఫరా చేయనున్నారు. ఈ వస్తువులన్నింటినీ ఒక కిట్టు రూపంలోకి తీసుకొచ్చిన అధికారులు ‘కేసీఆర్‌ కిట్స్‌’ పేరిట విద్యార్థులకు ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గురుకులాల్లో పంపిణీ కూడా చేశారు. నెలాఖరులోగా అన్ని గురుకులాలకు ఈ కిట్లను పూర్తిస్థాయిలో పంపిణీ చేయనున్నారు.

ఏళ్లుగా నలుగుతున్న సమస్య
ప్రస్తుతం రాష్ట్రంలో 487 గురుకుల పాఠశాలలున్నాయి. ఇందులో 134 సాంఘిక సంక్షేమ, 51 గిరిజన సంక్షేమ, 160 మైనారిటీ సంక్షేమ, 142 బీసీ సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.75 చొప్పున కాస్మొటిక్‌ చార్జీల కింద చెల్లిస్తున్నారు. ఈ మొత్తంతో విద్యార్థులు తమకు అవసరమైన సబ్బులు, టాల్కం పౌడర్, టూత్‌ పేస్ట్, శాంపూల వంటి వస్తువులను బయటినుంచి కొనుగోలు చేస్తున్నారు.

కాగా, ఈ మొత్తాన్ని పెంచాలని గత పదేళ్లుగా పలుమార్లు నిరసనలు వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాగా, 2017–18 బడ్జెట్‌ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాస్మొటిక్‌ చార్జీల విషయంలో కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీ సూచనల మేరకు కిట్ల రూపంలో వస్తువులు ఇవ్వాలని సంక్షేమ శాఖలు ప్రతిపాదించాయి. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యా ర్థులకు సరికొత్తగా కిట్లు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఒక్కో కిట్టుపై నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయనున్నారు.

మూణ్ణెళ్లకోసారి పంపిణీ
ఈ కిట్‌లు నెలవారీగా పంపిణీ చేయడం యంత్రాంగానికి భారం కానుండడంతో మూడు నెలలకు సరిపడా ఒకేసారి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. విద్యార్థికి పంపిణీ చేసిన తేదీ నుంచి మూడు నెలలు నిండిన వెంటనే వీటిని అందిస్తారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కొంతమేర అదనపు కోటాను గురుకులంలో సైతం అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top