చెరువులో టీడీపీ నాయకుడు నారాయణరావు మృతదేహం
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థిని(13)పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కథనం ప్రకారం...విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి సంబంధించి తుని కొండవారపేటకు చెందిన నారాయణరావుపై పోలీసులు బుధవారం ఉదయం కేసు నమోదు చేశారు. సాయంత్రం 5 గంటలకు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10.30 సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు రూరల్ స్టేషన్ నుంచి పోలీసులు ఎస్కార్ట్‌తో తుని బయల్దేరారు.
ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని నారాయణరావు చెప్పడంతో మార్గంమధ్యలో కోమటిచెరువు వద్ద వాహనం ఆపారు. జోరుగా వాన కురుస్తుండడంతో ఎస్కార్ట్ సిబ్బంది చెట్టు కింద నిల్చున్నారు. నారాయణరావు చెరువు వద్దకు వెళ్లాడు. కొంతసేపటికి పెద్ద శబ్దం వినిపించడంతో ఎస్కార్ట్ సిబ్బంది వెళ్లి చూశారు. నారాయణరావు కనిపించలేదు. చెరువులో దూకి పారిపోయాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా? అనే అనుమానంతో గాలింపు చేపట్టారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి వరకు వెదికినా నారాయణరావు ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, చెరువులో వలలు వేశారు. క్విక్ క్యూఆర్‌టీ టీమ్ చెరువు చుట్టూ గాలించింది. ఉదయం నారాయణరావు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.


