
10 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు
హిందూపురం మండలం, మలుగూరులో ఘటన
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా, హిందూపురం మండలం, మలుగూరు ప్రభుత్వ ఎంజేపీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఇది జ్వర సంబంధ అస్వస్థత అని వైద్యులు చెబుతున్నప్పటికీ, కలుషిత ఆహారమే కారణమని చెబుతున్నారు. ఘటన కారణాన్ని కావాలనే పక్కదారి పట్టిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వాంతులు చేసుకున్న అఖిల నందన్, వరుణ్‌కుమార్, దేవా నాయక్, మహీధర్, కౌశిక్, లిఖిత్, వరుణ్ సందేశ్, అభిరామ్, దినేష్ సహా మొత్తం 10 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని వెంటనే పాఠశాల సిబ్బంది 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
హిందూపురానికి గురువారం చుట్టపుచూపుగా వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ, టేకులోడు గురుకుల పాఠశాలలో మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సొంత నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా ఘటనపై ఆయన ఆరా తీయకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
కలుషిత ఆహారమే కారణం: వైఎస్సార్‌సీపీ
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, ఆమె భర్త వేణురెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ, కలుషిత ఆహారమే తాజా పరిస్థితికి కారణమన్నారు.
సుమారు 600 మంది విద్యార్థులున్న పాఠశాలలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని మండిపడ్డారు. జ్వరం వల్లనే విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని వైద్యులు తెలపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జ్వరం వస్తే ఒక్కరికో ఇద్దరికో వస్తుంది. కానీ ఒకేరోజు, ఒకేసారి 10 మంది విద్యార్థులు ఎలా ఆసుపత్రిలో చేరారో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.