ఎక్కడికక్కడే నీటి నిల్వ  | Sakshi
Sakshi News home page

ఎక్కడికక్కడే నీటి నిల్వ 

Published Tue, Apr 23 2019 1:56 AM

KCR command to construct 1,200 check dams as statewide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి, కృష్ణా బేసిన్‌ పరిధిలోని నదీ జలాలతోపాటు పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలతో లభించే ప్రతి నీటిచుక్కనూ ఒడిసిపట్టేలా ప్రభుత్వం పక్కా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గరిష్ట స్థాయిలో కృష్ణా, గోదావరి నీటిని మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ కట్టడి చేసేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర మాదిరి చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణంతో నీటిని చెరువులకు మళ్లించడం ద్వారా నీటి నిల్వలను పెంచి గరిష్ట ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

వాగులకు అడ్డుకట్ట.. 
కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు 299 టీఎంసీలు, గోదావరిలో 954 టీఎంసీల నీటి కేటాయింపులుండగా ఇందులో చిన్న నీటివనరుల కింద కృష్ణాలో 89 టీఎంసీలు, గోదావరిలో 165 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలులేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. దీనికితోడు కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయడంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా కృష్ణా బేసిన్‌లో చిన్న నీటివనరుల కింద వినియోగం 40 టీఎంసీలు దాటడం లేదు. గోదావరిలోనూ 165 టీఎంసీల మేర కేటాయింపులున్నా అనుకున్న మేర నీరు చేరడం లేదు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ధ్వంసం కావడంతో అనుకున్న మేర అవి నిండటం లేదు.

ఈ నేపథ్యంలో మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం... ఇప్పుడు వాటిని నీటితో కళకళలాడించే పనిలో పడింది. ఇందులో భాగంగా గోదావరి బేసిన్‌లో ప్రధాన నదీ ప్రవాహాలైన మంజీరా, మానేరు, తాలిపేరు, లెండి, పెనుగంగ, కిన్నెరసాని వంటి వాగులు, కృష్ణా బేసిన్‌లో మూసీ, ఊకచెట్టువాగు, పెద్దవాగు, డిండి వాగు, పాలేరు, తుంగపాడు వంటి వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. వాటి పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు అవకాశం ఉంటుందన్న దానిపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలవారీగా నిర్మాణానికి అనువయ్యే చెక్‌డ్యామ్‌ల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. 

మొత్తంగా 1,200.. రూ. 4,825 కోట్లు 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, ఉపనదులు, వాగులు, వంకలపై కలిపి మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో గోదావరి బేసిన్‌ పరిధిలోనే 840 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. కృష్ణా పరిధిలో సుమారు 700 మేర ప్రతిపాదనలురాగా వాటిని 400కు కుదించే అవకాశం ఉంది. ఇక నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు, ప్రాజెక్టుల సమీప కాల్వల నుంచి చెరువులకు నీటిని తరలించేలా తూముల నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 400 తూములను నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. అన్ని నిర్మాణాలకు మొత్తంగా రూ. 4,825 కోట్లు ఖర్చు చేసేలా ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో తూముల నిర్మాణానికి రూ. 410 కోట్లు వెచ్చించనున్నారు. చెక్‌డ్యామ్‌లకు సంబంధించిన వ్యయ అంచనాలు పరిపాలనా అనుమతుల కోసం ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి చేరుతున్నాయి. ఒక్కో చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 8 కోట్ల నుంచి వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పనులకు నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే రుణాలు తీసుకొనేలా ప్రభుత్వం యోచిస్తోంది.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement