భువనగిరిలో ప్రచారానికి గులాబీ అధినేత | Sakshi
Sakshi News home page

భువనగిరిలో ప్రచారానికి గులాబీ అధినేత

Published Mon, Mar 25 2019 9:54 AM

Kcr Attends Election Meeting At Bhuvanagiri And Miryalaguda - Sakshi

సాక్షి, యాదాద్రి : టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు రానున్నారు. ఏప్రిల్‌ 2వ తేదీన భువనగిరిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. తమ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కేసీఆర్‌ బహిరంగ సభలకు ప్లాన్‌ చేశారు.

మార్చి 29న మిర్యాలగూడలో, ఏప్రిల్‌ 2న భువనగిరిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో గులాబీ బాస్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లోనూ పని చేయాలని ఇప్పటికే అధినేత నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు అందాయి. అంతేకాకుండా ఈనెల 7వ తేదీన భువనగిరిలో జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గాస్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొని ఎమ్మెల్యేలు, నాయకులకు  దిశానిర్దేశం చేశారు. దీంతో వారు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.   

మెజార్టీపై టీఆర్‌ఎస్‌ దృష్టి
భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఐదుచోట్ల టీఆర్‌ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందాయి. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విజాయం సాధించారు. అయితే టీఆర్‌ఎస్‌ గెలిచిన  ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,95,280 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు గెలిచిన రెండుస్థానాలతోపాటు ఓడిన ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 5,36,893 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 58,387 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఆధిక్యం స్వల్పంగా ఉండడంతో అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భువనగిరి పార్లమెంట్‌పై ప్రత్యేక దృష్టిసారించి జిల్లా నాయకత్వానికి బాధ్యతలను అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆధిక్యం పెంచుకోవడానికి నాయకత్వం ఆపరేష్‌ ఆకర్షకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసను ప్రోత్సహిస్తోంది. నకిరేకల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీకీ బలమైన దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వ్యూహాత్మక ఎత్తుగడ
కాంగ్రెస్‌లోని బలమైన సామాజిక వర్గాలను ఆకర్షించడం ద్వారా వారి ఓటు బ్యాంకుతో మెజార్టీని భారీగా పెంచుకోవాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. ఏప్రిల్‌ 2న భువనగిరిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో భిక్షమయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆలేరు, నకిరేకల్‌ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణీనాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.  

Advertisement
Advertisement