కొత్వాల్‌ కొరడా..!  | Sakshi
Sakshi News home page

కొత్వాల్‌ కొరడా..! 

Published Wed, Jul 17 2019 11:21 AM

Karimnagar Police Very Alert For people Safety - Sakshi

‘రాత్రి 12 గంటలు. కోతిరాంపూర్‌లోని ఓ గల్లీలో కొందరు యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. చౌరస్తాలో అప్పటికే సిద్ధం చేసిన టేబుల్, దానిపై ఓ కేక్, క్యాండిల్స్‌... పుట్టినరోజు జరుపుకుంటున్న తమ మిత్రుడికి శుభాకాం క్షలు చెబుతూ కేక్‌ కట్‌ చేయించారు. కేరింతలు కొడుతూ బీర్ల మూతలు తెరిచారు. యువకుల సందడిని చూసిన ఓ వ్యక్తి 100 నెంబర్‌కు ఫోన్‌ చేయడంతో వెంటనే పెట్రోలింగ్‌ వాహనం అక్కడికి చేరింది. పోలీసు వాహనం హారన్‌ వినగానే ఎక్కడి వారు అక్కడ పరార్‌’    
– సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలను తగ్గించడం, మహిళలు, బాలికల రక్షణ, యువకుల విచ్చలవిడి తనానికి పుల్‌స్టాప్‌ పెట్టడం, అక్రమ దందాలను అరికట్టడం... తదితర అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి గత కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలకు మరింత పదును పెట్టారు. కమిషనరేట్‌ పరిధిలోని వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు బ్లూకోట్స్, పెట్రోలింగ్‌ స్టాఫ్, క్రైం పార్టీలు, ఈ కాప్స్, అడ్మినిస్ట్రేషన్, రిసిప్షన్‌ తదితర 10 విభాగాల సిబ్బందికి ఇచ్చే శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం బ్లూకోట్స్, పెట్రోలింగ్‌ టీంలతో పాటు క్రైంపార్టీ పోలీసులతో జరిగిన సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు.

క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి వారి నుంచి సలహాలు కూడా తీసుకున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్‌ టీమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రార్థనా స్థలాల వద్ద తెల్లవారు జామున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తరచూ ఈవ్‌టీజింగ్‌ జరిగే బస్టాండ్స్, పార్కులు, కాలేజీ అడ్డాలు వంటి ‘హాట్‌స్పాట్స్‌’ను గుర్తించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని వారిని ఆదేశించారు. వ్యవస్థీకృత భూదందాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటికే నిఘా ఉన్నప్పటికీ... పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత కరీంనగర్‌ లక్ష్యంగా పోలీస్‌ యంత్రాంగం పనిచేయాలని, విచ్చలవిడి తనాన్ని రూపు మాపడం, మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం ధ్యేయంగా పనిచేయాలని అధికారులు, క్షేత్రస్థాయి పోలీసులకు సూచనలు ఇచ్చారు. 

మనోళ్ల పనితీరు ఎలా ఉంది..?
సోమవారం స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ) పోలీసులతో కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి సమావేశం అయ్యారు. కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లు, సీఐ, ఎస్సైల తీరుపై ఆరా తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌హెచ్‌ఓలు, భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న వారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో ఉన్న పోలీసు అధికారుల వివరాలతోపాటు సామాన్యులు పోలీసుల విషయంలో ఎలా ఫీల్‌ అవుతున్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎస్‌బీ మీటింగ్‌లో సూచనలు, సలహాలు చేసిన అనంతరం ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. వడ్డీ దందాలు, ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. 

ఒక్కొక్కరు ఒక్క నేరాన్నైనా ఛేదించాలి:     
క్రైంపార్టీల్లో పనిచేస్తున్న పోలీసులు మెదడుకు పనిచెప్పాలని, వ్యూహాత్మకంగా నేరాలను ఛేదించాలని మంగళవారం జరిగిన  క్రైంపార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఎలాంటి కేసైనా పట్టుదలతో ప్రయత్నిస్తే ఛేదన కష్టం కాదని, ప్రతీ నేరానికి ఎక్కడో ఒకచోట క్లూ లభిస్తుందని అన్నారు. ఇతర జిల్లాల్లో నేరగాళ్లు పట్టుబడే విధానాలను పరిశీలించాలని సూచించారు. సైబర్‌ ల్యాబ్‌తోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. క్రైంపార్టీలలో పనిచేసే పోలీసులు ఒక్క నేరాన్ని అయినా స్వయంగా ఛేదించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 

31లోగా అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో ఈ నెల 31లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్‌ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థినులు, మహిళలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, లేడీస్‌ హాస్టళ్లు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి వంద మంది గుమిగూడే ఏ ప్రాంతమైనా సీసీ కెమెరా తప్పనిసరని, సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తే ఎలాంటి సంఘటననైనా రికార్డు చేయవచ్చని అన్నారు. పాఠశాలల్లో చదివే ఎదిగిన పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలోని ప్రతి ఆవరణ నిక్షిప్తం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఆ సందర్భంగా ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయని ఓ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement