కందనూలు కవితా కుసుమం కన్నుమూత

Kapilavai Linga Is Died - Sakshi

అనారోగ్యంతో కన్నుమూసిన కపిలవాయి లింగమూర్తి

సాక్షి, హైదరాబాద్‌/కందనూలు: సాహితీరంగంలో తనదైన ముద్రవేస్తూ కందనూలు (నాగర్‌కర్నూల్‌) జిల్లా ఖ్యాతిని నలుదిశలా విస్తరింపచేసిన ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి (90) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట తాలుకా జీనుకుంట గ్రామంలో 1928 మార్చి 31న జన్మించిన కపిలవాయి లింగమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పూర్తిచేశారు. ఆ తర్వాత 1954లో ఉపాధ్యాయుడిగా, 1972లో కళాశాల ఉపన్యాసకుడిగా చేరి 1983లో ఉద్యోగ విరమణ పొందారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలు, ఆలయాలకు కథలకు ఆయన ప్రాణం పోశారు. ఆయన రచనల్లో మొత్తం 70 రచనలు ముద్రితమయ్యాయి. ఇందులో తిరుమలేశ శతకం, పాలమూరు జిల్లా దేవాలయాలు, జినుకుంట రామబంటు శతకం వంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సాహిత్యం, చరిత్ర, పురావస్తుశాస్త్రంపై వందకు పైగా గ్రంధాలు రాశారు.

ఆయన రాసిన వాటిలో పాలమూరు జిల్లా దేవాలయాలు, సాలగ్రామ శాస్త్రం, మాంగళ్య శాస్త్రం, ఆర్యా శతకం, సోమేశ్వర క్షేత్ర మహత్యం, సుందరీసందేశం, పద్యకథాపయనం, శ్రీరుద్రాధ్యయం తదితర గ్రంధాలు ప్రముఖమైనవి. కవిల కళానిధి, కవి కేసరి, వేదాంత విశారద, గురుశిరోమణి, సాహిత్య స్వర్ణ సౌరభ వంటి బిరుదులను అందుకున్నారు. ఇక 2014లో కవి కాళోజీ నారాయణరావు పురస్కారం, 2018లో దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2014 ఆగస్టులో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈనెల 8వ తేదీ ఉదయం లింగమూర్తి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  సంతాపం వ్యక్తం చేసిన వారిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రాష్ట్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలుగు విశ్వద్యాలయం వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ, ప్రముఖ కవి గోరటి వెంకన్న,  తెలంగాణ రిసోర్స్‌ సెంటర్‌ చైర్మన్‌ వేదకుమార్‌ ఉన్నారు.

ముఖ్యమంత్రి సంతాపం
కపిలవాయి లింగమూర్తి మృతి పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాహితీ రంగంలో కపిలవాయి చేసిన విశేష కృషిని సీఎం గుర్తు చేసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top