అనంతగిరికి ఆఖరి ఘడియలు

Kaleshwaram water from Madhya maneru to Ananthagiri On 26-02-2020 - Sakshi

నేడు ఊరు ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధం... తొలుత ఎస్సీకాలనీ వాసుల ఖాళీకి ఏర్పాట్లు 

రేపు అనంతగిరికి మధ్యమానేరు నుంచి కాళేశ్వరం జలాలు

సిరిసిల్ల: అనంతగిరి గ్రామం జలసమాధి కాబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరికి ఆఖరి ఘడియలు సమీపించాయి. ఊరు ఖాళీ చేసేదిలేదని నిర్వాసితులు భీష్మించుకుని కూర్చున్నా.. ఎలాగైనా ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఎస్సీ కాలనీని ముందుగా ఖాళీ చేయించనున్నారు.

నిర్వాసితులకు ‘అనంత’కష్టాలు: అనంతగిరిలో 837 కుటుంబాలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్యాకేజీలను 735 కుటుంబాలకు అందించారు. మిగతా కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. నిబంధనల మేరకు వీరికి 102 ఇళ్లను అధికారులు అనంతగిరి శివారుల్లో నిర్మించి ఉంచారు. కానీ, ఇప్పుడే నీరు వస్తుందని ఊహించని నిర్వాసితులు.. పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేదు. ఇం కా ఎక్కడ ఉండాలో తేల్చుకోలేదు. ఈ క్రమంలో నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారు. 

ఇవీ సమస్యలు: అనంతగిరిలో 2017 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను కుటుంబాలుగా గుర్తించారు. ఆ జాబితా 1,135కు చేరింది. తంగళ్లపల్లి శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో 70 ఎకరాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. కానీ మౌలిక వసతులు లేవు. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ఇంటి స్థలం ఇచ్చారు. నిర్వాసితులతో కలెక్టర్‌ కృష్ణభాస్కర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సోమవారం చర్చించారు. తొలుత మంగళవారం 115 దళిత కుటుంబాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. మంగళ వారం ఊరు ఖాళీ చేయగానే, బుధవారం మధ్య మానేరు నుంచి నీళ్లు అనంతగిరిలోకి రానున్నాయి.   

సీఎం కేసీఆర్‌ సమీక్ష
మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్‌ వరకు చేర్చేందుకు అనంతగిరి వద్ద ఎదురవుతున్న ప్రతిబంధకాలపై సీఎంకేసీఆర్‌ సమీక్షిస్తున్నట్లు సమాచారం. అనంతగిరికి గోదావరి నీళ్లు చేరితే.. మల్లన్నసాగర్‌ వరకు నీళ్లు వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది.  సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి తో సీఎం మాట్లాడినట్లు సమాచారం. దీంతో అనంతగిరి నింపేందుకు పనులు సాగుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top