రామయ్యనూ పట్టించుకోలే..

K Laxman Speech In Kothagudem At Khammam - Sakshi

కొడుకు పట్టాభిషేకం కోసమే కేసీఆర్‌ యజ్ఞయాగాలు 

బీజేపీని చూసి కల్వకుంట్ల వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి 

ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చాలామంది కట్టప్పలు తయారయ్యారు

సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో పాలనను పూర్తి అవినీతియమంగా మార్చి తన కుటుంబానికి మాత్రమే దోచిపెడుతున్న కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని, చివరకు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్యను సైతం నిర్లక్ష్యం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్‌ అన్నారు. కొత్తగూడెంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అవినీతి పాలనతో విసుగు చెందిన ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ తల్లీకొడుకుల పార్టీగా మారిపోవడం, ఆ పార్టీ నుంచి గెలిచిన వారు సిగ్గులేకుండా టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక టీడీపీ ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆయన ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్‌ బాటలో నడుస్తుండడంతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. 70 ఏళ్ల జమ్ముకశ్మీర్‌ సమస్యను 70 రోజుల్లో పరిష్కరించిన బీజేపీ.. సింగరేణి కార్మికుల సమస్యలను సైతం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. సింగరేణి కార్మికుల శ్రమను టీఆర్‌ఎస్‌ దోచుకుంటోందని, ఏరు దాటాక బోడ మల్లయ్య అన్న చందంగా సింగరేణి కార్మికుల విషయంలో కేసీఆర్‌ వ్యవహరించారని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ చేతిలో మోసపోయిన నల్ల సూర్యులు అగ్నిసూర్యులై ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణితో పాటు, తెలంగాణ వ్యాప్తంగా అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పాల్గొన్న నాయకులను ఖాతరు చేయకుండా ఉద్యమ ద్రోహులకు మంత్రిపదవులు ఇచ్చారని, రజాకార్ల పార్టీ మజ్లిస్‌తో స్నేహం చేస్తూ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగీ, షోయబుల్లాఖాన్‌ లాంటి వారు చేసిన త్యాగాలను మరుగున పరిచి తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే సెప్టెంబర్‌ 17న అభినవ సర్ధార్‌ పటేల్‌ అమిత్‌షా తెలంగాణలో జాతీయజెండా ఎగురవేస్తారన్నారు.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో బిడ్డింగ్‌కు పోకుండా అక్రమంగా అగ్రిమెంట్‌ చేసుకున్నారన్నారు. అవినీతిమయమైన పాలనతో నయాం నిజాంలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పినట్లు కేసీఆర్‌ బాహుబలి అయితే, అక్కడ చాలామంది కట్టప్పలు సైతం ఉన్నారని తెలుసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కేవలం పాకిస్తాన్‌ను సంతోషపెట్టేలా మాత్రమే పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో కోనేరు సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి అమర్‌నాథ్, రంగాకిరణ్, ముస్కు శ్రీనివాసరెడ్డి, కుంజా సత్యవతి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top