కూలి చెల్లింపులో జాప్యం వద్దు

Jupally Krishna Rao about salary payments to workers - Sakshi

ఉపాధి కూలి, ఆసరా చెల్లింపులకు తొలి ప్రాధాన్యత: జూపల్లి

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని, వీటి చెల్లింపునకే బ్యాంకులు, పోస్టాఫీసులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యంపై బ్యాంకర్లు, తపాలా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. నిరుపేద కూలీలకోసం ఉపాధి హామీ పథకం చేపడుతున్నామని, కూలి చెల్లింపులో జాప్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్యాంకుల ద్వారా చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, నగదు కొరత కారణంగా పోస్టల్‌ చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. బ్యాంకుల్లో ఖాతా తీసుకునేందుకు ఆధార్‌ కార్డుతోపాటు పాన్‌ కార్డు అడగడం వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే మూడు నెలలపాటు ఆపరేట్‌ చేయకుండా ఉన్న కూలీల అకౌంట్లను తొలగించడం, జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లను ప్రారంభించేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించడం లాంటి కారణాలతో దాదాపు 60 శాతం చెల్లింపులను పోస్టల్‌ ద్వారా చేయాల్సి వస్తుందని వివరించారు.

ఉపాధి కూలీలకు చెల్లింపులకోసం ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులకు రూ.360 కోట్లను, పోస్టాఫీసులకు రూ.412 కోట్లను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకులు రూ.350 కోట్ల వరకు చెల్లింపులు జరిపాయని, తపాలా శాఖ కేవలం రూ.79 కోట్లు మాత్రమే చెల్లించిందని అధికారులు వివరించారు. తపాలా శాఖ తీరుపై జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలని పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ పీవీఎస్‌ రెడ్డిని ఆదేశించారు.

ఆర్‌బీఐ నుంచి నగదు విడుదల చేయకపోవడం, వారం రోజులుగా పోస్టల్‌ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని పీవీఎస్‌ రెడ్డి వివరించారు. నగదు కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధి నిధుల చెల్లింపు కోసమే ప్రత్యేకంగా రూ.150 కోట్లను బుధవారం విడుదల చేశామని ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top