నిరుద్యోగులకు వరం.. జాబ్‌మేళా

job mela at aler - Sakshi

25న ఆలేరులో మెగా జాబ్‌మేళా

30 పరిశ్రమల్లో 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు

యాదగిరిగుట్ట (ఆలేరు) : నిరుద్యోగ సమస్యను అధిగమించే దిశగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ, ఇంట్లోనే ఖాళీగా గడుపుతున్న నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో వివిధ పరిశ్రమలతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చర్చలు జరిపి, నిరుద్యోగులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి ఆలేరులో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక తిప్పలుండవ్‌..
ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, ఆత్మకూర్‌(ఎం), బొమ్మలరామారం మండలాల్లో ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ వేట చేసి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. దీంతో ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయం, ఉపాధి కూలీ, తదితర పనులు చేసుకుంటున్నారు. గమనించిన ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సహకారంతో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారులతో కలిసి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో జాబ్‌మేళ నిర్వహించడానికి సిద్దమయ్యారు.

ఈనెల 25న జాబ్‌ మేళా...
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదీన ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 9.30గంటల నుంచి మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సుమారు 30 ప్రైవేట్‌ పరిశ్రమలతో అగ్రిమెంట్‌ చేసుకొని, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఈ జాబ్‌మేళా చేపడుతున్నారు. ఈ మెగా జాబ్‌మేళాకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించనున్నారు.

విద్యార్హత ఇదే..
8, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, నర్సింగ్, ఐటిఐ తదితర అర్హతలతో కూడిన నిరుద్యోగులు  జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులు. www. employment.telangana.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. జాబ్‌మేళాకు వచ్చే వారు 3 సెట్లు విద్యార్హత జిరాక్స్‌ పత్రులు, సర్టిఫికెట్లు తీసుకురావాలి.

సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల25వ తేదీన ఆలేరు పట్టణంలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నియోజకవర్గంలోని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని 30 ప్రైవేట్‌ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ జాబ్‌మేళాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. -గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే

ఉద్యోగం సంపాదిస్తా
ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగం సంపాదిస్తాను. అంతే కాకుండా ఇతర నిరుద్యోగులను సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేస్తాను.  -శ్రీకాంత్, నిరుద్యోగి, యాదగిరిగుట్ట
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top