భూపాలపల్లి.. ఆరోగ్యం అదుర్స్‌

Jayashankar Bhupalpally Gets Third Rank In Health And Nutrition Category - Sakshi

117 జిల్లాలకు గాను మూడో స్థానం

ఆగస్టు–2019 ర్యాంకులు ప్రకటించిన నీతి ఆయోగ్‌

ఆసిఫాబాద్‌కు 39, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 63వ ర్యాంకు

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యం, పోషకాహారం అందించడంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం మొత్తం దేశంలోని 117 ఆశావహ జిల్లాలకు ర్యాంకులను కేటాయించిన నీతి ఆయోగ్, భూపాలపల్లి జిల్లా చేసిన కృషిని ప్రశంసించింది. ఈ మేరకు ఆగస్టు–2019 డెల్టా ర్యాంకులను సోమవారం ప్రకటించింది. గతంలో ఆరోగ్యం, పోషకాహారం వంటి విషయాల్లో భూపాలపల్లి జిల్లా స్కోరు 64గా ఉండగా.. ఈసారి 73కు చేరింది. దీంతో మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపింది.

ర్యాంకింగ్‌ ఇలా.. 
డెల్టా ర్యాంకింగ్‌లో ఇతర అంశాలతోపాటు ఆరోగ్యం, పోషకాహారానికి 30 శాతం మార్కులను కేటాయిస్తారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిగణనలోకి తీసుకుంటారు. 32 ఆరోగ్య, పోషకాహార అంశాలపై ఈ ర్యాంకింగ్‌ను నిర్ధారించారు. ఐసీడీఎస్‌ల ద్వారా వారికి అందుతున్న ప్రత్యేక పోషకాహార కార్యక్రమం అమలును కూడా నీతి ఆయోగ్‌ పరిశీలించింది. ఎనీమియాతో బాధపడుతున్న మహిళలను గుర్తించి వారికి సరైన వైద్యం అందించడంలో చేసిన కృషికి కూడా మార్కులు వేసింది.

గర్భిణులకు హిమోగ్లోబిన్‌ పరీక్షలను కనీసం 4 సార్లు కంటే ఎక్కువగా చేయడాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. స్త్రీ, పురుషుల నిష్పత్తి, ఆస్పత్రుల్లో ప్రసవాలు, శిశువు పుట్టిన గంటలోపు తల్లి పాలు అందించడం, తక్కువ బరువుతో పుట్టే శిశువుల శాతాన్ని తగ్గించడం, ఐదేళ్లలోపు తక్కువ బరువున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ, డయేరియా రాకుండా చిన్నారులకు వోఆర్‌ఎస్‌ వంటి పానీయాలు అందించడంలో చేస్తున్న కృషిని నీతి ఆయోగ్‌ పరిశీలించింది. వీటిలో అనేక వాటిల్లో భూపాలపల్లి జిల్లా మంచి ప్రతిభ కనబర్చిందని తెలిపింది. అలాగే క్షయ వ్యాధి నివారణకు చేపడుతున్న చర్యలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏ మేరకు వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చుతున్నదీ పరిగణలోకి తీసుకున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామాల్లో చేపట్టే పారిశుద్ధ్య, పోషకాహార కార్యక్రమాలను కూడా ర్యాంకింగ్‌కు తీసుకున్నారు. అంగన్‌వాడీలకు ఉన్న సొంత భవనాలనూ మార్కులకు ప్రాతిపదికగా తీసుకోవడం విశేషం. ఆరోగ్యం, పోషకాహారంలో డెల్టా ర్యాంకింగ్‌ సాధించిన, ఆయా అంశాలపై పర్యవేక్షణ చేసిన భూపాలపల్లి కలెక్టర్‌ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అభినందించారు. ఇక డెల్టా ర్యాంకింగ్‌లో ఆసిఫాబాద్‌ జిల్లా 39వ ర్యాంకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 63వ ర్యాంకు సాధించాయని నివేదిక తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top