సెల్ఫ్‌ డిస్మిస్‌ లేదు

JAC Leaders Meeting With CS Over RTC Strike - Sakshi

చర్చల్లో అన్నీ పరిష్కారమవుతాయి

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సీఎస్‌తో ఉద్యోగుల జేఏసీ నేతల భేటీ

ఉద్యోగుల జేఏసీ నేత కారం రవీందర్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘మేము (ఆర్టీసీ కార్మికులు) కార్యాలయాలకు వెళ్తలేం కాబట్టి ఉద్యోగులం కాదన్న మాట ప్రభుత్వం నుంచి వచ్చింది. సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదం ఎక్కడా లేదు. చెప్పినంత మాత్రాన తీసేసినట్టు కాదు. రేపు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పుడు అన్ని అంశాలొస్తాయి. సెల్ఫ్‌ డిస్మిస్‌కు కూడా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది’అని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం సాయంత్రం ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని తాత్కాలిక సచివాలయంలో కలసి వినతిపత్రం అందజేసింది.అనంతరం జేఏసీ నేతల తో కలసి కారం రవీందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 19న జరగనున్న రాష్ట్ర బంద్‌ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పాల్గొంటుం దని అన్నారు. ఆ రోజు మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన తెలియజేస్తామన్నారు.

నమ్మకంతో ఉన్నారు.. 
‘చాలా మంది కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నరు. గతంలో 43 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చింది. 16 శాతం ఐఆర్‌ ఇచ్చింది. ప్రభుత్వం తప్పనిసరిగా తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆర్టీసీ కార్మికులు నమ్మకంతో ఉన్నరు. ప్రభుత్వం ఈ నమ్మకాన్ని నిజం చేయాల్సి ఉంది’అని సీఎస్‌కు వివరించినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి, కండక్టర్‌ సురేందర్‌ గౌడ్‌లు ఆత్మహత్యకు పాల్పడగా, కొందరు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు గుండెపోటుతో మరణించిన విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.సమ్మెలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని కోరినట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరామని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్‌ మమత పేర్కొన్నారు.

మాకు ఏ లోగుట్టు లేదు.. 
టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలకు ఎలాంటి లోగుట్టు లేదని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగులకు ఏ లోగుట్టు ఉందో మాకు అదే ఉందని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతల బలహీనతల వల్ల ఉద్యోగుల ప్రయోజనాలు నీరుగారిపోతున్నాయని వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై 15 అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు.

2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు, రెండు డీఏలు రావాల్సి ఉందన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, సీపీఎస్‌ స్థానంలో పాత పెన్షన్‌ విధానం అమలు చేయాల న్న డిమాండ్లను సీఎస్‌ ముందు ఉంచామన్నారు.  కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ప్రభుత్వ మే జీతం చెల్లించాలని డిమాండ్‌ చేశామన్నారు. ఈ నెల 24న హుజూర్‌నగర్‌ ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని సీఎస్‌ హామీ ఇచ్చారన్నారు.

సాయంత్రం 4 గంటలకు బీఆర్‌కేఆర్‌ భవన్‌కు చేరుకున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎస్‌ను కలిసేందుకు దాదాపు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. సీఎస్‌ వేరే సమావేశంలో ఉండటంతో ఉద్యోగ నేతలు వేచిచూడక తప్పలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top