కౌలు రైతుకు మేలేదీ? | Sakshi
Sakshi News home page

కౌలు రైతుకు మేలేదీ?

Published Mon, Jan 22 2018 5:00 PM

is it farm aid not for koulu farmers - Sakshi

వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు చేయనున్న పెట్టుబడి సాయం పథకంపై కౌలు రైతులు నిరాశతో ఉన్నారు. పెట్టుబడి సాయాన్ని పట్టాదారులకు కాకుండా క్షేత్రస్థాయిలో పంట సాగుచేస్తున్న తమకు ఇవ్వాలని కోరుతున్నారు. పెట్టుబడి సాయం పథకంతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి ఆవేదన చెందుతున్నారు. భూపట్టాదారుల్లోని ధనిక రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. వారి భూమిని సామాన్య రైతులు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తాము భూయజమానులకు కౌలు చెల్లిస్తుండగా, ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని వారికే ఇస్తుండటం ఏమిటని అంటున్నారు.

జిల్లాలో 1,69,892 ఎకరాల సాగు భూమి
జిల్లాలోని 16 మండలాల్లో 1,69,892 ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 3,74,519 రైతులు భూములు కలిగి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు రికార్డుల ప్రక్షాళనలో గుర్తించారు. భూమి కలిగిన రైతుల్లో సుమారు 50శాతానికి పైగా తమ భూములను ఇతరులకు కౌలుకు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కౌలుకు తీసుకున్న వారు ఆయా భూములకు సంబంధించి ఎకరానికి రూ.8 నుంచి రూ.11వేల వరకు కౌలు చెల్లిస్తుండగా ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో భూ యజమానికి మరో రూ.4 వేలు అదనంగా లబ్ధిచేకూరనుంది.

కౌలు రైతులను ఆదుకోని ప్రభుత్వం
అనేక కష్టనష్టాలను ఎదుర్కొని పంటసాగు చేస్తున్న కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటసాగు చేసిన సమయంలో అనుకోని విపత్తులు వచ్చి నష్టపోయిన సమయంలో సైతం తమకు ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందించిన పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఆర్థికంగా చేయూతనందించాలని కౌలు రైతులు కోరుతున్నార

సాగు చేసిన వారికే డబ్బులు ఇవ్వాలి
పంట సాగు చేసిన వారికే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. పంటలు ఒకరు సాగు చేస్తే ఇంకొకరికి డబ్బులు ఇస్తామనటం సరైనది కాదు. డబ్బులు పట్టాదారులకే ఇవ్వటం వల్ల మాకు ఎలాంటి మేలు జరగదు.   
– నల్లమాస హరినాథ్, కౌలు రైతు, బయ్యారం 

రైతులందరికీ సాయం అందించాలి
పంటలు పండించే రైతులందరికీ ప్రభుత్వం సాయం అందించాలి. పట్టాదారులకే కాకుండా కాస్తులో ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించినప్పుడే రైతులు పంటలసాగుపై దృష్టి పెడతారు. వీటితోపాటు పండించిన పంటకు గిట్టుభాటు ధర కల్పించాలి.    – గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి

Advertisement
Advertisement