ఐఆర్‌సీటీసీ వింటర్‌ టూర్స్‌

IRCTC Winter packages For Tours And Travel - Sakshi

ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం మేఘాలలో తేలిపోదాం  

సరికొత్త ప్రాంతాలను సందర్శిద్దాం   

మధురానుభూతిని ఆస్వాదిద్దాం

సాక్షి, సిటీబ్యూరో: భారత్‌ దర్శన్‌ వంటి ఆధ్యాత్మిక పర్యటనలు, స్కూల్‌ టూర్స్‌తో వినోద, విజ్ఞాన పర్యటనలు, హైదరాబాద్‌ నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానయాన పర్యటనల కోసం  ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్న ఐఆర్‌సీటీసీ నగరవాసుల కోసం వింటర్‌ టూర్స్‌ను సిద్ధం చేసింది. హైదరాబాద్‌ నుంచి మేఘాలయ, చిరపుంజి, మాలినాంగ్, ఖజిరంగా– గౌహతి తదితర టూర్‌ ప్యాకేజీలను ప్రకటించింది. అన్ని రకాల రవాణా, వసతి సదుపాయాలతో వీటిని రూపొందించినట్లు ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి సంజీవయ్య తెలిపారు. ఆహ్లాదం, కనువిందు చేసే ఎన్నో దర్శనీయ స్థలాలను ఈ పర్యటనలో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలు, ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. 

మ్యాజికల్‌ మేఘాలయ..  
ఈ పర్యటన నవంబర్‌ 7 నుంచి 12వ తేదీ వరకు ఉంటుంది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 7న తేదీ ఉదయం 9.20 గంటలకు ఫ్లైట్‌ (6ఈ 186)లో బయలుదేరి ఉదయం 11.45 గంటలకు గౌహతి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో  12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లైట్‌ (6ఈ 187)లో బయలుదేరి సాయంత్రం 5.55 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.
ఈ  పర్యటనలో భాగంగా మొదటి రోజు గౌహతి నుంచి షిల్లాంగ్‌ చేరుకుంటారు. వార్డ్స్‌లేక్, పోలీస్‌బజార్‌ వంటి స్థలాలను సందర్శిస్తారు. రెండో రోజు చిరపుంజి పర్యటన ఉంటుంది. నొఖాలికై జలపాతం, మౌసమి గుహలు, ఎలిఫెంటా ఫాల్స్‌ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు.   
ఆసియాలోనే అతి పరిశుభ్రమైన గ్రామంగా పేరొందిన మాలినాంగ్‌ను మూడోరోజు సందర్శిస్తారు. లివింగ్‌ రూట్‌ బ్రిడ్జి, డాకీలేక్‌  తదితర ప్రాంతాలు ఈ పర్యటనలో ఉంటాయి. సాయంత్రం  షిల్లాంగ్‌ చేరుకుంటారు.   పర్యటనలో నాలుగో రోజు ఖజిరంగా నేషనల్‌ పార్కు సందర్శన ఉంటుంది. డాన్‌బొస్కో మ్యూజియం, ఉమియుమ్‌ లేక్‌ సందర్శిస్తారు. 5వ రోజు పర్యటనలో భాగంగా జీప్‌ సఫారీ,  బాలాజీ టెంపుల్, కామాఖ్య దేవాలయం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. 6వ రోజు గౌహతి నుంచి తిరిగి హైదరాబాద్‌ బయలుదేరుతారు.

చార్జీలు ఇలా..

విమానచార్జీలు, రవాణా, హోటల్‌ తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీ ఇద్దరికి కలిపి బుక్‌ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.33,325 చొప్పున, ముగ్గురికి కలిపి బుక్‌ చేసుకుంటే రూ.30,397 చొప్పున ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.26,373 చార్జీ ఉంటుంది.

జైసల్మేర్‌టుఉదయ్‌పూర్‌..
రానున్న శీతాకాలంలో మరో ఆకర్షణీయమైన పర్యటన రాజస్థాన్‌. నవంబర్‌ 12 నుంచి 17 వరకు ఉంటుంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12న ఉదయం 5.05 గంటలకు ఫ్లైట్‌ (6ఈ 995)లో బయలుదేరి 7.05 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి మరో ఫ్లైట్‌ (2టీ 703)లో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు జైసల్మేర్‌ చేరుకుంటారు. తిరుగుప్రయాణంలో 17వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు ఫ్లైట్‌ (6ఈ 484)లో  బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.  
♦ ఈ పర్యటనలో జైసల్మేర్‌ పోర్ట్, పట్వాన్‌ హవేలీ, గడిసార్‌ లేక్‌ తదితర ప్రాంతాలను మొదటి రోజు సందర్శిస్తారు.
♦ రెండోరోజు ఎడారి క్యాంప్, జీప్‌రైడ్‌ వంటివి ఉంటాయి. మరుసటి రోజు జైసల్మేర్‌ నుంచి బయలుదేరి జోధ్‌పూర్‌ చేరుకుంటారు. ఆక్కడ మెహ్రంగార్త్‌ ఫోర్ట్, జశ్వంత్‌ తాడ తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. 4వ రోజు జోద్‌పూర్‌ నుంచి ఉదయ్‌పూర్‌ చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఉదయ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి టూర్‌లో 6వ రోజు తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.  

చార్జీలు ఇలా..
అన్ని సదుపాయాలతో కలిపి ఒక్కరికి రూ.35,950. ఇద్దరికి కలిపి బుక్‌ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ.27,700 చొప్పున చార్జీలు ఉంటాయి. ముగ్గురికి కలిపి బుక్‌ చేసుకుంటే రూ.26,000 చొప్పున చార్జీ ఉంటుంది. పిల్లలకు రూ.23,450 చొప్పున ఉంటుంది. 

రన్‌ఆఫ్‌ కచ్‌.. 
నవంబర్‌ 16 నుంచి 18 వరకు కొనసాగే ఈ పర్యటనలో రన్‌ ఆఫ్‌ కచ్‌ వేడుకలను వీక్షించవచ్చు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  16న ఉదయం 8.35 గంటలకు ఫ్లైట్‌ (జీ8–551)లో బయలుదేరి 10.30 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి ఫ్లైట్‌ (2టీ711)లో బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు కాండ్లా చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో 18న సాయంత్రం 4.05 గంటలకు ఫ్లైట్‌ (2టీ717)లో కాండ్లా నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ఫ్లైట్‌ (జీ8–552)లో రాత్రి 8.35 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు హైదరాబాద్‌
చేరుకుంటారు.  

చార్జీలు ఇలా..
ఈ పర్యటన చార్జీ ఇద్దరికి కలిపి బుక్‌ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.29,000 చొప్పున, ముగ్గురికి కలిపి బుక్‌ చేసుకుంటే రూ. 27,563 చొప్పున ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top