ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

Intermediate Practicals Examinations Form  February One - Sakshi

నల్లగొండ : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్‌డీఓలతో కోఆర్డినేషన్‌ కమిటీ మీటింగ్‌ కూడా పూర్తయింది. పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను ఏవిధంగా చేయాలనేది ఇంటర్‌ బోర్డు సూచనలు చేయడంతో ఆ మేరకు జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్, ఎగ్జామినేషన్‌ కమిటీతో కలిసి ఏర్పాట్లను చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో ఉన్న కళాశాలలతోపాటు ప్రైవేట్‌ కళాశాలలు మొత్తం 119 ఉన్నాయి. ఇందులో మొదటి సంవత్సరంలో 36,362 మంది విద్యార్థులు ఉండగా, రెండో సంవత్సరంలో 19,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

మొదటి సంవత్సరానికి సంబంధించి నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఇవి కూడా థియరీనే. నైతికత, మానవ విలువలు పరీక్ష పూర్తి కాగా, పర్యావరణ విద్య పరీక్షను పంచాయతీ ఎన్నికల కారణంగా 31 వాయిదా వేశారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 19,539 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ తదితర ప్రాక్టికల్స్‌ చేయనున్నారు. నాలుగు విడతలుగా  ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఒక్కో విడతలో 18 కళాశాలల చొప్పున కొనసాగించనున్నారు. నాలుగు విడతల్లో అన్ని కళాశాలల్లో పరీక్షలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఫిబ్రవరి 27 నుంచి థియరీ పరీక్షలు 
ఫిబ్రవరి 27వ తేదీనుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఒకేషనల్‌ కళాశాల విద్యార్థులకు కూడా థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 27వ తేదీన ఉదయం 9గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 13 వరకు జరగనున్నాయి.

ఎగ్జామినేషన్‌ కమిటీ ఏర్పాటు
ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ఎగ్జామినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి, సీనియర్‌ ప్రిన్సిపా ల్, జూనియర్‌ లెక్చరర్లతో కలిపి ఎగ్జామినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీనే పరీక్షల నిర్వహణ చేస్తుంది.

కలెక్టర్, ఎస్పీలతో హైపవర్‌ కమిటీ
హైపవర్‌ కమిటీలో కలెక్టర్, ఎస్పీ, బాలు ర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్, ఒక సబ్జెక్ట్‌ లెక్చరర్, మరో ఎక్స్‌పర్ట్‌ జూనియర్‌ లెక్చరర్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరంతా ఎక్కడ సమస్య ఉన్నా, ఏమైనా ఆరోపణలు వచ్చినా వెంటనే పర్యవేక్షిస్తారు.

థియరీకి 46 కేంద్రాలు 
థియరీ పరీక్షలకు 46 కేంద్రాలను ఏర్పా టు చేశారు. 12 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్, రెండు మోడల్‌ స్కూల్, 2 రెసిడెన్షి యల్‌ కళాశాలలతోపాటు మరో 29 ప్రైవే ట్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు మొత్తం 46 చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 46 డీఓలు, 8మంది కస్టోడియన్స్, 2 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీములు, 4 సిట్టింగ్‌ స్క్వాడ్‌ టీములను ఏర్పా టు చేయనున్నారు.

14 పోలీస్‌స్టేషన్లలో ప్రశ్నపత్రాల భద్రత
పరీక్షలకు సంబంధించి 14 పోలీస్‌స్టేషన్లలో ప్రశ్న, సమాధానపత్రాలను భద్రపర్చనున్నారు. 7 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ గట్టి బందోబస్తు ఏ ర్పాట్లు చేయనున్నారు. ప్రశ్నపత్రాల రవా ణాకు సంబంధించి ఆర్టీసీ అధికారులు 19 రూట్లను ఎంపిక చేశారు. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా పోస్టులో వచ్చే పత్రాలను తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకోనుంది. ఇన్విజిలేటర్లను మాత్రం పరీక్ష సమయంలోనే అధికారులు ఆయా కళాశాలల్లో ఏర్పాటు చేసుకోనున్నారు. అన్ని కార్యక్రమాలు, స్ట్రాంగ్‌ రూంలు, డీఆర్‌డీసీ వెన్యూ కోమటిరెడ్డి ప్రతీక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనే ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top