ఎస్‌ఏ పరీక్షల్లో 1, 2, 3వ తరగతులకు 100 మార్కులు
80కు ప్రశ్నపత్రం, మరో 20కు ఇంటర్నల్
క్వశ్చన్ పేపర్‌తో పాటు బుక్‌లెట్‌లోనూ జవాబులు రాయాల్సిందే
1, 2 క్లాసులకు 8.. 3, 4, 5కు 15 పేజీలు
రెండున్నర గంటల్లో రెండు షీట్లలో జవాబులు
ఇబ్బందులు పడుతున్న చిన్నారులు
నోరెళ్లబెడుతున్న ఉపాధ్యాయులు
చదువు పేరుతో చిన్నారులపై కూటమి ప్రభుత్వం పెద్ద భారంమోపి పైశాచికానందాన్ని పొందుతోంది. చదువులు, ర్యాంకుల పేరుతో ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలల్లోనే ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి ఉండింది. అయితే తాజాగా ఈ కోవలోకి ప్రభుత్వ స్కూళ్లూ వచ్చి చేరాయి.
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న చిన్నారులకు 100 మార్కులను కేటాయించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. వీటిలో 80కు ప్రశ్నపత్రం, మరో 20కు ఇంటర్నల్ మార్కులుంటాయని ప్రకటించారు. ఇంటర్నల్‌లో ఏ విధ«ంగా కేటాయిస్తారో నేటికీ చెప్పలేదు. గతంలో కేవలం 50 మార్కులకే ప్రశ్నపత్రం ఉండగా, చిన్నారులకు ప్రస్తుతం అగ్నిపరీక్ష పెట్టారు.
నెల్లూరు (టౌన్): పరీక్షల పేరుతో చిట్టి బుర్రలపై భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. ఉపాధ్యాయులకు సైతం అర్థం కాని ప్రశ్నలిస్తుండటం గమనార్హం. ఈ పరిణామాల క్రమంలో టీచర్లే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఆన్సర్ షీటుతో పాటు వర్క్‌బుక్‌లోనూ జవాబులు రాయాలని ఆదేశించారు. దీంతో ఏమీ తెలియని చిన్నారులు పరీక్షలంటేనే తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఇదీ తంతు..
జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను ఈ నెల పది నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. గవర్నమెంట్ స్కూళ్లలో 1.8 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదు వరకు 85 వేల మందికిపైగా ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వారు ఈ పరీక్షలనే రాయాల్సి ఉంది. వీరందరికీ ఒకే ప్రశ్నపత్రాన్ని ముద్రించి పంపిణీ చేశారు. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం సొంతంగా ముద్రించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ ముద్రించిన క్వశ్చన్ పేపర్‌తోనే ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు జరుపుతున్నారు.
పరీక్షలు ఇలా..
» 1, 2వ క్లాసులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్.. 3, 4, 5కు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
పరీక్షలుంటాయి.
» అదే ఆరు నుంచి పది వరకు సబ్జెక్టుల వారీగా నిర్వహిస్తారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 100 మార్కులను కేటాయించారు.
» 80కు ప్రశ్నపత్రం, 20కు ఇంటర్నల్ పేరుతో మార్కులేయనున్నారు. జవాబు పత్రంతో పాటు వర్క్‌బుక్‌లోనూ రాయాల్సి ఉంది.
» 1, 2కు 8.. 3, 4, 5 క్లాసులకు 15 పేజీలను కేటాయించారు.
» 20 ప్రశ్నలకు సంబంధించిన జవాబులను షీటులో, మిగిలిన 13కు సమాధానాలను బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంది. రెండున్నర గంటల్లో రెండు షీట్లలో జవాబులను ఎలా రాయాలో చిన్నారులకు అర్థం కావడం లేదు. అసలీ వ్యవహారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులకు తెలియదాననే సందేహం తలెత్తుతోంది.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
1, 2 తరగతుల ప్రశ్నపత్రంలా లేదని.. ఎంఏ చదివే వారికి ఇచ్చిన తరహాలో ఉందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలబస్‌తో సంబంధం లేకుండా శాస్త్రీయబద్ధంగా సైతం లేదంటున్నారు. సెల్ఫ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ ప్రశ్నపత్రాల రూపకల్పనపై తమ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వీటి ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను ఎలా పరీక్షించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీచర్లే చెప్పి రాయిస్తున్న పరిస్థితి
జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే సమాధానాలు చెప్పి పిల్లలతో రాయిస్తున్నారని సమాచారం. ఈ ప్రశ్నపత్రం ప్రకారం మెజార్టీ విద్యార్థులు ఫెయిలయ్యే పరిస్థితి ఉంది. రెండు పేపర్లు రాసేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనానికే సమయం సరిపోతుందని, బోధన ఇంకెప్పుడు చేయాలని ప్రశ్నిస్తున్నారు.
సీసీఈ పరీక్ష విధానమే సరికాదు
సీసీఈ పరీక్ష విధానమే సరికాదు. 1, 2వ తరగతులకు రెండు సార్లు జవాబులు రాయాలనడం తగదు. సొంతంగా సిలబస్ ఇవ్వడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉపాధ్యాయులే సమాధానం చెప్పి రాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చదువుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. – మోహన్‌దాస్, రాష్ట్ర నేత, ఏపీటీఎఫ్
మార్పు తీసుకురావాలి
ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్ష విధానంలో మార్పులు తీసుకురావాలి. ఒక సిలబస్‌నే రెండుసార్లు ఇవ్వడంతో ప్రయోజనం ఉండదు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది సరైన విధానం కాదు. – నవకోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్


