బిరబిరా కృష్ణమ్మ.. కదలి రావమ్మా! | Increasing water storage in Almatti project | Sakshi
Sakshi News home page

బిరబిరా కృష్ణమ్మ.. కదలి రావమ్మా!

Jul 25 2017 1:22 AM | Updated on Sep 5 2017 4:47 PM

బిరబిరా కృష్ణమ్మ.. కదలి రావమ్మా!

బిరబిరా కృష్ణమ్మ.. కదలి రావమ్మా!

రాష్ట్రం వైపు మరో రెండు మూడు రోజుల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలు కానున్నాయి.

► రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి కృష్ణా పరవళ్లు..
► 100 టీఎంసీలకు చేరిన ఆల్మట్టి నిల్వ
►  ప్రస్తుతం 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
►  రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం..
► ఇప్పటికే నారాయణపూర్‌కు 33 వేల క్యూసెక్కులు విడుదల
► మరో 20 టీఎంసీలు చేరితే దిగువకు కృష్ణమ్మ పరుగులు


సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రం వైపు మరో రెండు మూడు రోజుల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలు కానున్నాయి. ఎగువ కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు జలకళను సంతరించుకో వడంతో దిగువ ఆశలు సజీవమయ్యాయి. అక్కడ కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవడంతో ఆల్మట్టిలోకి నీటి ప్రవాహాల ఉధృతి కొనసాగుతోంది.

దీంతో సోమవారం ఉదయానికి 88.94 టీఎంసీలు ఉన్న నిల్వ సాయంత్రానికి 100 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 1.42 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని దిగువ నారాయణపూర్‌కి నీటి విడుదల కొనసాగుతుండటంతో అక్కడ మట్టాలు పెరిగాయి. రెండు ప్రాజెక్టుల్లో మరో 20 టీఎంసీల మేర నీరు చేరితే దిగువ జూరాలకు నీటి విడుదల జరిగే అవకాశాలున్నాయి.

ఆల్మట్టికి జల కళ
కృష్ణా పరీవాహకంలో గడిచిన పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టులోకి ఈ పది రోజుల్లోనే సుమారు 70 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 1.42 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టి వాస్తవ నీటి మట్టం 1,705 అడుగుల కాగా ప్రస్తుతం 1,696.52 అడుగులకు నీరు చేరింది. 129.7 టీఎంసీలకు గానూ సోమవారం ఉదయానికి 88.94 టీఎంïసీల నీటి లభ్యత ఉంది. ఉదయం నుంచి భారీగా ప్రవాహాలు కొనసాగడంతో సాయంత్రానికి మట్టం 100 టీఎంసీలకు చేరినట్లు కర్ణాటక నీటి పారుదల వర్గాలు తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చాయి.

భారీ వరదను దృష్టిలో పెట్టుకొని పవర్‌ హౌజ్‌ ద్వారా 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి నుంచి వదిలిన నీరంతా దిగువ నారాయణపూర్‌కు వస్తుండటంతో ఆ ప్రాజెక్టు నిండేందుకు సిద్ధంగా ఉంది. నారాయణపూర్‌లో 37.64 టీఎంసీ సామర్థ్యానికి గానూ సోమవారం ఉదయం 29.88 టీఎంసీల నీరు లభ్యంగా ఉంది. ఉదయం నుంచి 35,740 క్యూసెక్కుల ప్రవాహాలు ఉండటంతో ప్రాజెక్టు ఏ క్షణమైనా నిండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు నిండేందుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని, అదే జరిగితే దిగువ జూరాలకు నాలుగు రోజుల్లో కృష్ణా ప్రవాహాలు నమోదవుతాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.6 టీఎంసీల సామర్థ్యానికి గానూ 6.73 టీఎంసీల నిల్వ ఉంది. ఒక్కసారి ప్రవాహాలు మొదలైతే ప్రాజెక్టు నీటిపై ఆధారపడిన ఆయకట్టుకు నీటి విడుదల మొదలు కానుంది.

5 లక్షల ఎకరాలకు సాగునీరు..
ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి రెండుమూడు రోజుల్లో నీటి విడుదల జరిగే అవకాశం ఉండటం, మరో నాలుగు రోజుల్లో జూరాలకు ప్రవాహాలు ఉండే అవకాశం ఉన్నందున మహబూబ్‌నగర్‌లో జూరాలపై ఆధారప నడిన ఆయకట్టుకు నీరందించే ప్రక్రియపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టింది. జూరాల కింద ఉన్న లక్ష ఎకరాలకు నీటిని అందించడంతో పాటు బీమా నుంచి 2 లక్షలు, నెట్టెంపాడు నుంచి 1.5 లక్షలు, కోయిల్‌సాగర్‌ నుంచి 50 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చెరువులను నింపేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఇదివరకే అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement