హంగులకే కోట్లు ఇస్తున్నారు

Illegal Tenders Was Given For  Adilabad Muncipality Building Construction - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్టుంది ఆదిలాబాద్‌ కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణం తీరు. భవన నిర్మాణం కంటే మిగితా హంగులకే రెట్టింపు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా ప్రారంభమైన ఈ భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడంలేదు. పైపెచ్చు.. అంచనా వ్యయాలు పెరుక్కుంటూ ఇంతవరకూ వచ్చింది. 

మొదట మున్సిపల్‌ ఫండ్‌ 
కొత్త రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలకవర్గం ఆదిలాబాద్‌ బల్దియాలో కొలువుదీరిన తర్వాత 2017లో మున్సిపాలిటీ కోసం కొత్త భవనం నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో భవనం అన్ని సదుపాయాలతో నిర్మించాలని భావించారు. అప్పుడు మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చే బీఆర్‌జీఎఫ్‌ నిధులను దీనికోసం వెచ్చించాలని యోచించారు.

అయితే బీఆర్‌జీఎఫ్‌ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో అసలు సమస్య వచ్చింది. దీంతో అప్పటికే మిగులు బీఆర్‌జీఎఫ్‌ నిధులు, మున్సిపల్‌ ఫండ్‌ కలిపి రూ.1.70 కోట్లతో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. టెండర్‌ను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ నిధుల మేరకు కేవలం భవన నిర్మాణం చేసి వదిలిపెట్టారు. భవనానికి లోపల, బయట తుది మెరుగులకు నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. 

నాసిరకంగా నిర్మాణం 
అప్పట్లో కాంట్రాక్టర్‌ భవన నిర్మాణానికి సంబంధించి నాణ్యత పాటించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ భవన నిర్మాణంలో పెచ్చులు ఊడిపోయాయని చెబుతున్నారు. అంతేకాకుండా  నిర్మాణ సమయంలో వాటర్‌ క్యూరింగ్‌ సరిగా చేయకపోవడంతో భవనం నాణ్యతపై ప్రశ్న తలెత్తుతోంది. దీంతోనే పెచ్చులు ఊడిపోయాయని పలువురు పేర్కొంటున్నారు.

కోట్ల నిధులు వెచ్చించి భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో అధికారులు కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులొత్తడం ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఆర్‌అండ్‌బి కింద ఆరునెలల క్రితం ఈ టెండర్‌ మంజూరైంది. అయితే వరుసగా ఎన్నికలు రావడంతో టెండర్‌ పనులు పూర్తికాలేదు.

తాజాగా టెండర్‌ పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్ల పనులను అప్పగించారు. అందులో భాగంగా మున్సిపాలిటీ భవనాన్ని ఆకర్షణీయమైన హంగులతో నిర్మాణం పూర్తి చేసేందుకు 15 రోజుల కిందట పనులు ప్రారంభించారు. అయితే మున్సిపల్‌ అధికారుల తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రధానంగా వరుసగా ఎన్నికలు వచ్చిన సమయంలో కలెక్టర్‌ అనుమతి తీసుకొని వివిధ పనులు చేపట్టారు.

మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు ఇదివరకే ప్రారంభమైన దృష్ట్యా కలెక్టర్‌ అనుమతితో ఎప్పుడో మళ్లీ టెండర్‌ చేసి పనులు అప్పగించేందుకు చర్యలు తీసుకొని ఉంటే ఈపాటికి భవన నిర్మాణం పూర్తయ్యేది. అయితే పాలకవర్గం పదవీకాలం జూలై 2వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు వేచిచూసిన అధికారులు ఇటీవల టెండర్‌ పనులు పూర్తిచేయడం వెనక ఆంతర్యమేమిటో?  

ఆర్‌అండ్‌బీ నిధులతో మళ్లీ జీవం 
బీఆర్‌జీఎఫ్‌ నిలిచిపోవడం, ఇటు మున్సిపాలిటీలో నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో అసలు భవన నిర్మాణం పూర్తవుతుందా?.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల పట్టణ శివారులో ఉన్న పలు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన విషయం విదితమే. అందులో భాగంగా ఆదిలాబాద్‌ బల్దియాను 36 వార్డుల నుంచి 49 వార్డులకు పెంచారు.

దీంతో మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందికి మరింత బాధ్యత, పనితీరు పెరగనుంది. దీనికితోడు ప్రస్తుతం ఉన్న భవనం విస్తరించిన మున్సిపాలిటీ కార్యకలాపాలకు సరిపోనివిధంగా ఉండడం కూడా రానున్న రోజుల్లో కొత్త భవనం ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న భవనానికి ఎదురుగానే ఇందిరా టౌన్‌హాల్‌ స్థలంలో ప్రస్తుతం సంప్‌హౌజ్‌కు సమీపంలోనే ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు.

జీ ప్లస్‌ 3 నమూనాలో నిర్మిస్తున్న ఈ సముదాయంలో పైఅంతస్తు పూర్తిగా సమావేశ మందిరం కోసం చేపడుతున్నారు. ప్రస్తుతం 49 వార్డులకు పెరగడంతో కౌన్సిలర్ల సంఖ్య 49తో పాటు కోఆప్షన్‌ సభ్యులు, అధికారులు అందరూ కలిపి సుమారుగా వందమంది సమావేశ మందిరంలో కూర్చునేందుకు వీలుగా భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవనం నిర్మించినప్పటికీ మెరుగులు దిద్దాల్సి ఉంది.

ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌ పనులు చేపట్టేందుకు వీలుగా రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. సమావేశ మందిరంలో పూర్తిగా సెంట్రల్‌ ఏసీ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భవిష్యత్‌లో గ్రేడ్‌–1 మున్సిపాలిటీ నుంచి మరింత ఉన్నత గ్రేడ్‌ సాధించినా ఈ భవనంలో కార్యకలాపాలకు సరిపోయేలా పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో మున్సిపల్‌ ఏఈ అరుణ్‌ను వివరణ కోరగా భవన నిర్మాణ పనులు మళ్లీ 15 రోజుల కిందట ప్రారంభించినట్లు తెలిపారు.త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top