‘మహా’ దోపిడీ మళ్లీ షురూ!

 illegal mining of sand in manjira river - Sakshi

అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక అక్రమ తవ్వకాలు

మంజీరలో మన భూభాగంలోకి చొరబాటు

మన ఇసుకను తరలించి మనకే విక్రయిస్తున్న వైనం

మహారాష్ట్ర జేసీబీని జప్తు చేసిన జిల్లా అధికారులు

మంజీర తీరంలో ‘మహా’ అలజడి మొదలైంది.. మన భూభాగంలో ఇసుక దోపిడీ మళ్లీ షురువైంది.. అనుమతుల ముసుగులో మహారాష్ట్ర కాంట్రాక్టర్లు అంతర్రాష్ట్ర సరి‘హద్దులు’ దాటుతున్నారు. జిల్లా భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. మరోవైపు, మన వారే ‘మహా’ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఆ ఇసుకను దెగ్లూర్, మద్నూర్‌ మీదుగా హైదరాబాద్, బీదర్‌ తదితర ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఇలాగే ఇసుక తరలిస్తుండగా, జిల్లా అధికారులు దాడి చేసి జేసీబీని పట్టుకున్నారు. సుమారు 16 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించుకు పోయినట్లు అధికారులు నిర్ధారించారు. తరచూ తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుక తవ్వేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారి తీస్తోంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ‘మహా’ దోపిడీ మళ్లీ షురువైంది. మహారాష్ట్ర క్వారీల పేరుతో తెలంగాణ భూభాగంలోని మంజీర నదిలో ఇసుకను తోడేస్తున్నారు. నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. శాఖాపూర్‌ (మహారాష్ట్ర) ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమంగా తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతుండగా.. నిజామాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం గురువారం దాడి చేసి పట్టుకున్నారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడి తోడేస్తున్న భారీ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నదిలో రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా.. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు నాలుగు ఎకరాల లోనికి సరిహద్దు లు దాటి తెలంగాణ భూభాగంలో అక్ర మంగా ఇసుక తోడేసినట్లు గుర్తించారు. ఈ ఒక్కచోటే సుమారు 16 వేల క్యూ బిక్‌ మీటర్ల ఇసుకను మహారాష్ట్ర కాంట్రాక్టర్లు తవ్వుకు పోయినట్లు ప్రాథమికంగా గుర్తించా రు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. మంజీర న ది వెడల్పులో సగ భూభా గం తెలంగాణది.. మరోసగం మహారాష్ట్రకు ఉంటుంది. అయితే తెలంగాణ భూభాగంలో ఇసుక తోడేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారితీస్తోంది.

రాత్రయితే చొరబాట్లు.. 
చీకటి పడితే చాలు మహారాష్ట్ర జేసీబీలు తెలంగాణ భూభాగంలోకి వచ్చి అక్రమంగా చొరబడుతున్నాయి. భారీ జేసీబీలతో రాత్రికి రాత్రి వందల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడేయడం పరిపాటిగా మారింది. స్థానికులు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికార యంత్రాంగం ఈ అక్రమ చొరబాట్ల గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఇసుక వనరులు దోపిడీకి గురవుతుండగా.. ఈ క్వారీల ఆదాయంతో మహారాష్ట్ర సర్కారు ఖజనా నిండుతోంది. 

మన వారే ‘మహా’ కాంట్రాక్టర్లు.. 
మహారాష్ట్ర క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి తెర లేపిన కాంట్రాక్టర్లు మన రాష్ట్రం వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు మహారాష్ట్ర వ్యక్తులను తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీకి తెర లేపుతున్నారు. పైగా ఇక్కడి ఇసుకను దెగ్లూర్‌ (మహారాష్ట్ర), మద్నూర్‌ మీదుగా హైదరాబాద్, బీదర్‌ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఇసుక వాహనాలు ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయి. మన ఇసుకను మహారాష్ట్ర క్వారీల పేరుతో తోడేసి.. మళ్లీ మన తెలంగాణలోనే విక్రయిస్తూ.. మహారాష్ట్ర సర్కారు ఖజానాను నింపుతున్న అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రూ.కోట్లల్లో ఆదాయం 
ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం మంజీర నదిలో తమ వైపు ఉన్న ఇసుక క్వారీలకు టెండర్లు పిలుస్తుంది. ఈ ఏడాది సుమారు పది క్వారీలకు టెండర్లు పిలిచారు. ఒక్కో క్వారీకి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు మహారాష్ట్ర సర్కారు ఆదాయాన్ని గడిస్తోంది. అక్కడి గనుల శాఖ ద్వారా నాందేడ్‌ జిల్లా అధికారులు ఈ క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్వారీల్లో ప్రస్తుతానికి శాఖాపూర్, షెల్‌గాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే, ఆయా  క్వారీల కాంట్రాక్టర్లు తమకు నిర్దేశించిన మహారాష్ట్ర భూభాగంలో కాకుండా.. అక్రమంగా తెలంగాణ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి ఇసుకను తోడేస్తున్నారు. 

అటువైపు నిండుకున్న ఇసుక నిల్వలు.. 
మంజీర నదికి అవతలి వైపు క్వారీలకు ఏటా టెండర్లు పిలిచి భారీగా తవ్వేస్తుండడంతో అటువైపు ఇసుక నిల్వలన్నీ అయిపోయాయి. నాణ్యత లేని నల్ల ఇసుక, మట్టితో కూడిన ఇసుక మాత్రమే మిగిలింది. దీంతో కాంట్రాక్టర్లు రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ భూభాగం పరిధిలోకి చొచ్చుకొచ్చి తవ్వకాలు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top