అనర్హులను గుర్తించండి | Sakshi
Sakshi News home page

అనర్హులను గుర్తించండి

Published Fri, May 27 2016 2:00 AM

Identify ineligible

రుణమాఫీపై బ్యాంకర్లకు మంత్రి ఈటల పిలుపు

 

హైదరాబాద్: నకిలీ పాసు పుస్తకాలతో రుణమాఫీ పొందిన రైతులను గుర్తించడంలో ప్రభుత్వానికి బ్యాంకులు సహకరించాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మొదటి, రెండో విడత రుణమాఫీ సొమ్ము అనేక మంది అనర్హులకు చేరిందని తమకు నివేదికలు వచ్చాయన్నారు. వచ్చే విడత రుణమాఫీ సొమ్ము అనర్హులైన రైతులకు చేరకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ తమ సొమ్ము కాదని నకిలీ పాసు పుస్తకాల ద్వారా రుణమాఫీ పొందే వారి పట్ల బ్యాంకులు చూసీచూడనట్లుగా వ్యవహరించొద్దన్నారు. పేద పిల్లలు చదువుకోవడానికి విద్యా రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు.  వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికీ కొన్ని బ్యాంకులు రైతుల నుంచి రుణంపై వడ్డీ వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.  వడ్డీల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని కూడా చాలా బ్యాంకులు పూర్తిస్థాయిలో బీమా కంపెనీలకు పంపలేదని పేర్కొన్నారు.


దీనివల్ల అనేక మంది రైతులు బీమా సొమ్ము రాక నష్టపోయారన్నారు. పత్తి పంట ప్రీమియం చెల్లింపునకు గడువును జూన్ 14గా కేంద్రం నిర్ణయించిందని, ఈ విషయంలో బ్యాంకులు వ్యవసాయశాఖకు సహకరించాలన్నారు. ఎస్‌బీహెచ్ ఎండీ సంతాను ముఖర్జీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement