నేనూ ‘గ్రామీణ’ విద్యార్థినే.. | i am also coming from rural background | Sakshi
Sakshi News home page

నేనూ ‘గ్రామీణ’ విద్యార్థినే..

Sep 22 2014 11:18 PM | Updated on Mar 28 2018 11:05 AM

గ్రామీణ ప్రాంతంలో చదివానని, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు తనకు తెలుసని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు.

తాండూరు రూరల్: గ్రామీణ ప్రాంతంలో చదివానని, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు తనకు తెలుసని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్‌వీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘విద్యాహక్కు చట్టం అమలు - ఎస్‌ఎంసీ చైర్మన్ పాత్రపై’ నిర్వహించిన సదస్సులో ఆయన మట్లాడుతూ కర్నాకట సరిహద్దు ప్రాంతంలో ఉన్న తాండూరు, బషీరాబాద్, బంట్వారం మండలాల పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని చెప్పారు. ఇక్కడి పాఠశాలలో వసతులు లేవని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానన్నారు.
 
జిల్లాలో 334 పాఠశాల్లో ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి రోజు పాఠశాలలకు పంపించాలన్నారు. ఎస్‌ఎంసీ చైర్మన్లు పాఠశాల్లో ప్రతి రెండు నెలలకోసారి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మధ్యహ్న భోజనం తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎస్‌ఎంసీలపైనే ఉందన్నారు. పిల్లల భవిష్యత్‌ను మీరే తీర్చిదీద్దాలన్నారు. పాఠశాలలు అభివృద్ధి కావాలంటే గ్రామాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను వారానికి రెండుసార్లు ఎస్‌ఎంసీ చైర్మన్లు తనిఖీ చే సి, పరిస్థితులను స్థానిక ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్ధికి ఒక రోజు రూ.6 ఖర్చు చేస్తోందని, ప్రాథమిక పాఠశాల విద్యార్ధికి రూ.4 ఖర్చు చేస్తోందని చెప్పారు.
 
త్వరలో ఆర్‌వీఎం నుంచి నిధులు..
జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు త్వరలో ఆర్‌వీఎం నుంచి నిధులు విడుదలవుతాయని డీఈఓ రమేష్ చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో నిధులు లేవని చెప్పారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద ఉన్నత పాఠశాల్లో రూ.50 వేలు మౌలిక సదుపాయాల కోసం ఉన్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల పాఠశాలలను అభివృద్ధి చేస్తానన్నారు.
 
ఉపాధ్యాయుల్లో మార్పు వచ్చింది..
జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయుల తీరు మారిందని డీఈఓ చెప్పారు. ఉపాధ్యాయుల స్వభావం మరాలన్నారు. 70 శాతం ఉపాధ్యాయుల్లో మార్పు వస్తోందన్నారు. మిగతా 30 శాతం మంది విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారిని మొదట సముదాయిస్తామని, ఆ తర్వాత నోటీసులు ఇస్తామని, వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
డీఈఓకు సమస్యలు విన్నవించిన ఎస్‌ఎంసీ చైర్మన్లు..
విద్యాహక్కు చట్టం అమలు కార్యక్రమానికి వచ్చిన డీఈఓ రమేష్‌కు తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి వచ్చిన ఎస్‌ఎంసీ చైర్మన్లు పలు సమస్యలు విన్నవించారు. బషీరాబాద్ మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల తీరులో మార్పు తేవాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగ తి గదుల కొరత ఉందని విన్నవించారు. టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, బాలల హక్కుల పరిరక్షణ జిల్లా కన్వీనర్ సుదర్శన్, రిటైర్డ్ టీచర్స్ ఫోరం కన్వీననర్  జానార్దన్, ఎంఈఓ శివకుమార్‌తోపాటు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement