జనం కోసం తన ప్రాణాలు లెక్కచేయకుండా..

Hyderabad traffic police constable incredible job; viral video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పొరపాటున పట్టు తప్పితే.. అతని ప్రాణాలు నీళ్లలో కలిసిపోయేవి! కానీ ఆ సమయానికి అతను అక్కడ లేకపోతే.. నగరం ఒక పెను విషాదాన్ని చవిచూడాల్సి వచ్చేది!! అవును. ఇంకా పేరు వెల్లడికాని ఆ కానిస్టేబుల్‌ను నెటిజన్లు రియల్‌ హీరోగా అభివర్ణిస్తున్నారు... ఇంతకీ ఆయన చేసిన పనేంటి? ఎలా వెలుగులోకి వచ్చింది?

రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షానికి హైదరాబాద్‌ మహానగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. పండుగ సీజన్‌ కావడంతో హోరువర్షంలోనూ నెమ్మదిగానైనా జనం రాకపోకలు సాగిస్తున్నారు. మాదాపూర్‌లోనైతే రికార్డు స్థాయిలో 8సెం.మీ వర్షపాతం నమోదయింది. దీంతో శుక్రవారం వరద నదిని తలపించే స్థాయిలో పారింది. అదే సమయంలో కాళి సుధీర్‌ అనే వ్యక్తి తన కారులో అటుగా వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని వీడియోతీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ వైరల్ అయింది.

రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్న భవంతి వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఇనుప చువ్వలు మాత్రమే పైకి కనబడుతూ మృత్యుకుహరంలా తయారైంది. రోడ్డుపైన వెళ్లే వాహనదారులు కనీసం దానిని గుర్తించలేని పరిస్థితిలో ఓ సాధారణ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అక్కడ నిలబడి వాహనదారులకు సూచనలు ఇస్తూ కనిపించారు. కాళ్లను బలంగా నెట్టేస్తోన్న వరద.. పై నుంచి హోరు వర్షం.. వేటినీ లెక్కచేయకుండా కానిస్టేబుల్‌ తన విధిని నిర్వర్తించాడు.

ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సుధీర్‌.. ఆ కానిస్టేబుల్‌ ఎవరనేది తెలిస్తే, అతనికిగానీ, అతని పిల్లలకు గానీ బహుమానం ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ పనిని గుర్తించినందుకుగానూ సుధీర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ హైదరాబాద్‌ పోలీసు శాఖ, ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది. మొత్తంగా పేరు తెలియని కానిస్టేబుల్‌ రియల్‌ హీరోగా కితాబు అందుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top