ముమ్మర గస్తీ

Hyderabad Police Petroling In Outer City - Sakshi

మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అప్రమత్తం

సంక్రాంతి నేపథ్యంలో పల్లెబాట పట్టిన సిటీజనులు

కాలనీలు ఖాళీ అవుతుండటంతో దొంగలు తెగబడే అవకాశం  

గత వారం రోజులుగా వరుస చోరీలు

నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండుగ నేపథ్యం లో నగరవాసులు  పల్లెబాట పడుతుండడంతో నగరంతో పాటు శివారు ప్రాంతాలు బోసిపోతున్నాయి. లక్షలాది మంది పండుగ కోసం సొంతూళ్లకు పయనం కావడంతో కాలనీలకు కాలనీలే నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆయా ప్రాంతాల్లో అదును చూసు కొని దొంగ లు పంజా విసిరే అవకాశముంది. గతేడాది సంక్రాంతి పండుగ సమయాల్లో శివారు ప్రాంతా ల్లో దొంగలు చెలరేగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ‘గస్తీ’బాట పట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ప్రతి కాలనీలో సెక్టార్‌ ఎస్‌ఐ, బ్లూకోట్స్, రక్షక్‌ వాహన సిబ్బందిని రం గంలోకి దింపారు. కొత్త ఏడాదిలో వరుసగా చైన్‌స్నాచింగ్‌లు, చోరీలు జరగడంతో ఇప్పటికే అప్ర మత్తమైన మూడు కమిషనరేట్ల పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళితే సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా ఇంటి యజమానులు, అద్దెదారుల ఇచ్చిన సమాచారంతో పాటు ప్రతీ కాలనీలో పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ చేస్తూ దొంగత నాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటున్నారు.  

కత్తిమీద సామే...
సెలవులకు ముందే పెద్దఎత్తున దుండగులు చోరీలకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తిస్థాయిలో ప్రజలు పండగకు స్వగ్రామాలకెళ్లి ఇళ్లకు తాళాలు పడితే ఇంకా ఎంత విజృంభిస్తారోననే భయం వెంటాడుతోంది.  ఓవైపు  గస్తీ .. నిఘా పెంచామని పోలీసులు చెబుతున్నా..  దొంగలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అరెస్టులతో  నియంత్రణ చర్యలు చేపడుతున్నా దొంగతనాల జోరు కొనసాగుతూనే ఉంది. వారం రోజుల వ్యవధిలోనే  ఘట్‌కేసర్, బంజారాహిల్స్, పద్మారావునగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, కేపీహెచ్‌బీ ఠాణాలో పరిధిలో దొంగలు విజృంభించారు.  సంక్రాంతికి ముందే సవాల్‌ విసురుతుండటంతో రానున్న రోజుల్లో ఇంకెన్ని ఇళ్లకు కన్నాలు పడతాయోననే ఆందోళన నెలకొంది.  ఈ క్రమంలో మూడు కమిషనరేట్ల పోలీసులు చేపడుతున్న నియంత్రణ చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

ఇటీవల జరిగిన చోరీలు ఇవీ...
నెల 4న కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని  భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌–1కు చెందిన రెండు ఇళ్లలో, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీలోని మరో ఇంటిలో అర్ధరాత్రి దొంగలు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను  అపహరించారు.
వనస్థలిపురం, హయత్‌నగర్‌ ఠాణాల పరిధిలో ఈ నెల 8న పట్టపగలే మూడు చోరీలు జరిగాయి. వనస్థలిపురం ఫేజ్‌–2 వాసి సుధాకర్‌రావు ఇంట్లో 2.5 తులాల బంగారం, రూ.10 వేల నగదు అపహరించారు. ప్రశాంత్‌నగర్‌కు చెందిన జంగయ్య ఇంట్లో 27 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ చేశారు. మన్సూరాబాద్‌ నాయక్‌నగర్‌ కాలనీకి చెందిన ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకుడు శ్రీకాంత్‌ ఇంట్లో 7.5 తులాల బంగారం, 25 తులాల వెండి చోరీకి గురయ్యాయి.
ఈ నెల 10న ఘట్‌కేసర్‌ మండలం దత్తాత్రేయనగర్‌లో ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి వివాహితను చీరతో బంధించి 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top