వాన వదలట్లే!

Hyderabad People Suffering With Heavy Rain - Sakshi

నగరంలో ఎడతెరిపి లేని వర్షం  

ఐదు రోజులుగా ముసురు  

ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం  

ట్రాఫిక్, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం  

దుండిగల్‌ మండలం 120 గజాల కాలనీలో ఇళ్లలోకి చేరిన వరద  

జియాగూడ డోర్‌ బస్తీలో కూలిన ఇల్లు  

రంగంలోకి దిగిన బల్దియా బృందాలు  

మరో 48 గంటలు వర్ష సూచన

సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని ముసురు చుట్టేసింది. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ప్రతిరోజూ వర్షం పడుతుండడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఓవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్‌తో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ సమస్యతో ఒక్కొక్కరు సగటున రెండు గంటల పని కోల్పోతుండడం గమనార్హం. ఇక వర్షంకారణంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరంలోని ప్రధాన మార్కెట్‌లకు వచ్చే కూరగాయల దిగుమతులు అనూహ్యంగా తగ్గిపోయాయి. ఫలితంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు సీజనల్‌ వ్యాధులు విజృంభించడంతో సిటీజనులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.  

తగ్గిన దిగుమతులు...  
వరుస వర్షాలతో నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌ తదితర మార్కెట్లకు వచ్చే కూరగాయల దిగుమతి అనూహ్యంగా తగ్గింది. ప్రధానంగా బెంగళూరు, చిక్‌మంగళూరు, ఏపీలోని జిల్లాల నుంచి నిత్యం నగరానికి వచ్చే కూరగాయల్లో 30శాతం తగ్గినట్లు మార్కెటింగ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చే  కూరగాయల్లో 60శాతం మేర తగ్గాయి. దీంతో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగాయి. మరోవైపు సిటీలో చికెన్‌ వినియోగం అనూహ్యంగా పెరిగింది. 

వ్యాధుల పంజా..  
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సిటీలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ఇళ్ల మధ్యే నీరు నిల్వ ఉంటోంది. ఇవన్నీ ఈగలు, దోమలకు నిలయాలుగా మారాయి. వాటి వల్ల డెంగీ, మలేరియా, డయేరియా తదితర వ్యాధులు పంజా విసురుతున్నాయి. సీజనల్‌ వ్యాధులతో బాధపడుతూ సిటీజనులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

మరో రెండు రోజులు..  
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సరాసరిన నగరంలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బల్దియాకు ఫిర్యాదుల వెల్లువ..  
ముసురు కారణంగా జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చెట్లు కూలిపోయిన సంఘటనలపై 3 ఫిర్యాదులు, లోతట్టు ప్రాంతాలు జలమయమైన సంఘటనలపై 23 ఫిర్యాదులు అందినట్లు బల్దియా వర్గాలు తెలిపాయి.

అప్రమత్తమైన బల్దియా బృందాలు  
వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. రోడ్లపై నీరు నిల్వకుండా, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా, కూలిన చెట్లను వెంటనే తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు విధుల్లో ఉన్నాయని చెప్పారు. శుక్రవారం 40కి పైగా ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను డిజాస్టర్‌ రిలీఫ్‌ బృందాలు తొలగించాయని పేర్కొన్నారు. చెట్లు కూలిన ఫిర్యాదులు 12 నమోదు కాగా.. వాటిని వెంటనే తొలగించామన్నారు. పోలీస్, ట్రాఫిక్, జలమండలి, అగ్నిమాపక విభాగం, రెవెన్యూ తదితర విభాగాలతో జీహెచ్‌ఎంసీ సమన్వయంతో పని చేస్తోందన్నారు. గ్రేటర్‌లో గుర్తించిన 195 ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌ల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహించి అక్కడి నాలాల్లో ఏ విధమైన పూడిక, వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌ బృందాలు 13, మినీ మొబైల్‌ మాన్‌సూన్‌ బృందాలు 76, మేజర్‌ మొబైల్‌ మాన్‌సూన్‌ బృందాలు 75, జోనల్‌ ఎమర్జెన్సీ బృందాలు 2, స్టాటిక్‌ లేబర్‌ టీమ్‌లు 138, జలమండలి ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు 45 క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని తెలిపారు.  అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040–21111111, డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.

మేయర్‌ పర్యటన...  
వర్షాలతో నగరంలో నీటి నిల్వలు ఏర్పడ్డ ప్రాంతాలు, తదితర ప్రదేశాల్లో తనిఖీలు చేసిన మేయర్‌ రామ్మోహన్‌ నివారణ చర్యలను పరిశీలించారు. మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఇందిరాపార్కు, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఇదీ పరిస్థితి..
కంటోన్మెంట్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. రహదారుల పైకి వరద రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గాలులకు చెట్లు నేలకూలాయి. అక్కడక్కడ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  
మేడ్చల్‌లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరింది.
గండిమైసమ్మ–దుండిగల్‌ మండలం 120 గజాల్లో వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఇళ్లలోకి వరద చేరడంతో వస్తు సామగ్రి, ఆహార పదార్థాలు తడిసిపోయాయి. వరద బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ప్రతిసారీ మాకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు.  
జియాగూడ డోర్‌ బస్తీలో ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ... ఓ యాక్టివా వాహనం ధ్వంసమైంది.  
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. రాయదుర్గం, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కొండాపూర్‌ రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది.  
ఎల్‌బీనగర్‌లో జన జీవనం స్తంభించింది. ఎల్‌బీనగర్‌ రింగ్‌ రోడ్డు, నాగోలు, సాగర్‌ రింగ్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  
వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ మొరాయించాయి. ఈసీఐఎల్‌ చౌరస్తాలో సిగ్నల్‌ మొరాయించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నాచారం, మల్లాపూర్, భవానీనగర్, అశోక్‌నగర్, మర్రిగూడ, రాఘవేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.   

వర్షానికి అడ్డా కూలీ మృతి
తార్నాక: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం, ఈదురు గాలుల కారణంగా ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఓ అడ్డాకూలీ మృతిచెందిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరి«ధిలోని తార్నాక వైట్‌హౌజ్‌ ప్రాంతంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...జనగామ జిల్లా, ఈరంటి గ్రామానికి చెందిన సోమయ్య(50) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి తార్నాకలో ఉంటున్నాడు. అతడి భార్య ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ హబ్సిగూడలోని ఓ ఇంట్లో ఉంటోంది. సోమయ్య సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల సమీపంలోని  లేబర్‌ అడ్డాలో ఉంటూ కూలీగా పని చేసేవాడు. గురువారం రాత్రి తోటి కూలీలతో కలిసి  ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న అతను శుక్రవారం ఉదయం  మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు వీరన్న విరాళాలు సేకరించి సోమయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించాడు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top