సీఏఏ, ఎన్నార్సీ వద్దే వద్దు

Hyderabad People Says No To Citizenship Amendment Act - Sakshi

పౌర చట్టం, ఎన్సార్సీలకు  వ్యతిరేకంగా భారీ ర్యాలీ

కిక్కిరిసిన తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం

నగరంలో పలు చోట్ల భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

సాక్షి,హైదరాబాద్‌/కవాడిగూడ/ముషీరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనకారులు కదం తొక్కారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని ముక్త కంఠంతో నినదించారు. ఈ ర్యాలీ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ను తలపించింది. ఎంబీటీ, తెహ్రీక్, ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, జమాతే ఇస్లామీ, ఆహెలే హదీస్, తామిరే మిల్లత్‌తో పాటు పలు ప్రజా, దళిత, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు, సామాజిక, ధారి్మక, స్వచ్ఛంద సంస్థలతో కూడిన 48 సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) పిలుపునిచి్చన విషయం తెలిసిందే.

ఈ మేరకు లక్షలాది మంది ముస్లిం లు, నిరసనకారులు ‘మిలియన్‌ మార్చ్‌’లో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కుకు తరలివచ్చారు. నగరం నలుమూలల నుంచి కుటుంబసభ్యులతో సహా తరలిరావడంతో ఇందిరాపార్కు పరిసరప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. ఓ చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ప్లకార్డులను పట్టుకొని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇందిరాపార్కు, ఎన్టీఆర్‌ స్టేడియం, ధర్నా చౌక్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయం నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, తదితర ప్రాంతాలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనకారులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మహిళలు, చిన్నారులు సైతం అధిక సంఖ్యలో హాజరై ఆందోళనలో భాగస్వాములయ్యారు.

అంచనాలకు మించిన జనం..
పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద మాత్రమే నిరసన సభ జరుపుకొనేందుకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ, ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలిరావడంతో అటు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వరకు నలువైపులా జనంతో నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటలు దాటే సరికి తెలుగు తల్లి ప్లైఓవర్, లోయర్‌ట్యాంకు బండ్‌ కిక్కిరిసింది. దీంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

ట్రాఫిక్‌ చక్రబంధంలో వాహనదారులు..
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, హోటల్‌ మారియట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, బషీర్‌బాగ్, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల్లోని వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. జనాలతో రోడ్లన్నీ జనసంద్రంగా మారడంతో వాహనదారులు, బస్సులు ముందుకు, వెనక్కి కదలలేని పరిస్థితి. మరికొన్ని వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు దారి మళ్లించడంతో అక్కడ కూడా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ సందర్భంగా వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమైంది..
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది పార్లమెంటులో నెగ్గడం దేశచరిత్రలో దౌర్భాగ్యకరమని పలువురు ప్రజా సంఘాల నేతలు, ముస్లిం సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఈ బిల్లును తీసుకురావడం తీవ్ర విషాదకరమని మండిపడ్డారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఈ బిల్లు విఘాతం కలిగించేలా ఉందని ఆరోపించారు. సభలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అజీజ్‌బాషా, జేఏసీ కనీ్వనర్‌ ముస్తాక్‌ మాలిక్, ప్రొ.విశ్వేశ్వర్‌రావు, జస్టిస్‌ చంద్రకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్‌ నిజాముద్దీన్, అమ్జాదుల్లా ఖాన్, షబ్బీర్‌ అలీ, మౌలానా నసీరుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఏఏను కేంద్రం ఉపసంహరించుకునేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ బిల్లు మతంపై ఆధారపడిన బిల్లు అని, సుప్రీంకోర్టులో ఈ బిల్లు నిలబడదని జోస్యం చెప్పారు. ‘హిందువు అయితే ఎన్నార్సీలో పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు.. కానీ ముస్లిం అయితే పౌరసత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది దారుణమైన మతపరమైన వివక్ష’అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం హిట్లర్‌ చట్టాల కన్నా దారుణమైందని తీవ్రంగా దుయ్యబట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top