పద పదవే వయ్యారి గాలిపటమా!

Hyderabad International kites festival At Parade ground - Sakshi

కన్నుల పండువగా హైదరాబాద్‌ అంతర్జాతీయ పతంగుల పండుగ

పరేడ్‌ గ్రౌండ్‌లో సందర్శకుల ఉత్సాహం.. కేరింతలు!

ఆకట్టుకుంటున్నవివిధ డిజైన్ల పతంగులు

సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలుబోసిపోగా పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాలు మాత్రం సందర్శకులతో కిక్కిరిసి పోయాయి. నగరంలో సంక్రాంతి సందడంతా పరేడ్‌ గ్రౌండ్‌లోనేకనిపించింది. ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ ఉత్సాహం.. పండుగ వాతావరణాన్ని చూసేందుకు రెండు కళ్లుచాలవంటే అతిశయోక్తి కాదు. ఈ హడావుడితో మైదానం చుట్టూ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరం మురిసిపోయింది. ఆకాశం సప్తవర్ణ శోభితమైంది. పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ నగర గగనానికి కొత్తరంగులు అద్దింది. అంతర్జాతీయ పతంగుల పండుగను నగర యువత ఎంజాయ్‌ చేస్తోంది. అసలే పండుగ.. ఆపై వరుస సెలవులు కావడంతో సోమవారం భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. రకరకాల ఆకారాలు, రంగురంగుల పతంగులను ఎగరేస్తూ.. రాత్రి వరకు ఉత్సాహంగా గడిపారు.

ఈ పండుగకోసమే వచ్చిన దేశ, విదేశాలకు చెందిన పతంగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. గాలిలో నృత్యం చేస్తున్న టైగర్, డ్రాగన్, చింపాంజీ, గరుడ వంటి రకరకాల పతంగులు చూసేందుకు ఉత్సాహం చూపించారు. గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన డీజే సౌండ్స్‌ సందర్శకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. రిమోట్‌ సహాయంతో రాత్రి ఆకాశంలో ఎగురవేసిన లైటింగ్‌ పతంగులు ఈ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సప్తవర్ణాల పతంగులతో పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాలు కలర్‌పుల్‌గా మారాయి. అటు నెక్లెస్‌ రోడ్‌లోనూ కుర్రకారు ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు.  

ఇదినాలుగోసారి 
హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం ఇది నాలుగోసారి. ఈసారి.. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, స్వీడన్, పోలాండ్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, కొరియా, కాంబోడియా, పిలిప్పీన్స్‌ దేశాలకు చెందిన కైట్‌ ప్లేయర్స్‌ పాల్గొన్నారు. మాది గుజరాత్‌. వ్యక్తిగతంగా నాకు ఇది 15వ ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌. 45 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్స్‌ ఇందులో పాల్గొంటున్నారు. 

– పవన్‌ సొలంకి,
తెలంగాణ టూరిజం కైట్స్‌ కన్సల్టెంట్‌
  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top