
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
కంటోన్మెంట్ పార్క్‌లో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో బుధవారం ‘హైదరాబాద్ లిబరేషన్ డే’జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 8.55 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు ఆయన చేరుకుంటారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. సీఆర్‌పీఎఫ్, ఇతర బలగాలు నిర్వహించే పరేడ్‌ను వీక్షిస్తారు. పారామిలటరీ దళాల ప్రత్యేక పరేడ్ కూడా ఉంటుంది.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక (పూర్వ హైదరాబాద్ స్టేట్)లకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శన, థీమ్ ఆధారిత బ్యాలె, దేశభక్తితో కూడిన ప్రదర్శనలు ఉంటాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్ధేశించి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర చౌహాన్, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమం పూర్తయ్యాక జూబ్లీ బస్టాండ్‌కు సమీపంలోని కంటోన్మెంట్ పార్క్‌లో ఏర్పాటు చేసిన భారతరత్న, మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి విగ్రహాన్ని రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరి స్తారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళతారు.
హైదరాబాద్ లిబరేషన్‌డేను పురస్కరించుకొని ఉదయం 6.30 గంటలకు అసెంబ్లీ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.