
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బాలికల నిష్పత్తి పెరుగుతోంది. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంపై అధికారులు దృష్టి సారించడంతో ఈ ఫలితాలొచ్చాయి. ప్రభుత్వ శాఖలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మండల స్థాయి ప్రత్యేక కార్యచరణకు సిద్ధమైంది. ఇప్పటికే బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం అమలులో హైదరాబాద్‌కు కేంద్ర స్థాయి గుర్తింపు లభించడంతో అదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేసి గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ సిటీగా రూపు దిద్దేందుకు చర్యలు చేపట్టింది.
ఇందుకు బస్తీ నుంచి బడి వరకు పెద్దఎత్తున ప్రచారోద్యమం, అవగాహన సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. మండల స్థాయి అధికారులు, తహాసీల్దార్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనుంది మరోవైపు కౌమార బాలికల, సంరక్షణ, పోషకాహారం, రుతుక్రమం, పిల్లలపై జరిగే అత్యాచారం వంటి అంశాలపై ప్రతి కుటుంబంలో చైతన్యం తెచ్చేందుకు జిల్లా స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. పిల్లల సంఘటనలు జరిగినప్పుడు గట్టిగా అంటే నో అని అరవడం, గో అంటే భయపడకుండా అక్కడి నుంచి పరుగేత్తి చెప్పడం, టెల్ అంటే భయపడకుండా ఆ సంఘటన గురించి చెప్పడం, అవసరమైనే 1098 కు ఫోన్ చేసే విధంగా చైతన్యం కల్గించే విధ ంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్
ఇకనుంచిగుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికార యం త్రాంగం నిర్ణయించింది. చిన్నారులను చైతన్యం పర్చేందుకు అన్ని ఉన్నత పాఠశాలల్లో పెయింటింగ్స్ వేయించనుంది. టీచర్ల సంఖ్యను బట్టి నాలుగు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు పాఠశాల స్థాయి లో బాలికల రక్షణకు బాధ్యత అప్పగించనున్నారు.
బాలికల నిష్పత్తి పెరుగుతోంది..
నగరంలో బాలికల నిష్పత్తి పెరుగుతోంది. నాలుగేళ్లలో హైదరాబాద్ మహా నగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి 970 కు చేరుకుంది. వాస్తవంగా 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు బాలికల నిష్పత్తి తక్కువగా ఉండటం అందోళన కలిగించింది. మూడేళ్ల క్రితం జనవరి 22న నగరంలో బేటీæ బచావో. బేటీ పడావో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి విస్తత ప్రచారానికి నడుంబిగించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
హైదరాబాద్‌లో బాలికల నిష్పత్తి
2011–12 914
2014–15 942
2015–16 938
2016–17 967
2017–18 968
2018–19 970