‘జోష్‌’లో సభ్యత.. జాగ్రత్త!

Hyderabad CP Anjani Kumar Warning to Youth on New Year Celebrations - Sakshi

న్యూ ఇయర్‌ పార్టీలు శృతిమించేలా నిర్వహించొద్దు

అవాంఛనీయ ఘటనలకు నిర్వాహకులే బాధ్యులు

హోటల్స్, పబ్స్‌ యజమానులకు స్పష్టం చేసిన సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్‌ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరువొద్దని నిర్వాహకులకు నగర పోలీసులు స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడానికి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం హోటళ్లు, పబ్స్, క్లబ్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణకు నిర్ణీత సమయం ముందు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని కొత్వాల్‌ స్పష్టం చేశారు. ఈ పార్టీల నేపథ్యంలో కచ్చితంగా పాటించాల్సిన అంశాలను పోలీసు కమిషనర్‌ వారికి స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నింధనలున్నాయి.  
వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు.  
అక్కడ ఏర్పాటు చేసే సౌండ్‌ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్‌ మించరాదు.  
న్యూ ఇయర్‌ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి.  
వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్‌ నిర్వాహకులు అనుమతించొద్దు
యువతకు సంబంధించి ఎలాంటి విశృంకలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి.  
బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు.  
ఎక్సైజ్‌ అధికారులు అనుమతించిన సమయాన్ని మించి మద్యం సరఫరా చేయకూడదు.  
జనసమర్థ, బహిరంగ ప్రాంతాల్లో టపాకులు పేల్చకూడదు. నిర్ణీత ప్రదేశాల్లో అవసరమైన సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
మద్యం తాగి వాహనాలు నడిపేతే కలిగే దుష్ప్రరిణామాలు, చట్ట ప్రకారం వారిపై తీసుకునే చర్యల్ని వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి.  
మద్యం తాగిన వారు వాహనాలు నడపకుండా ఉండేలా ‘డిజిగ్నేటెడ్‌ డ్రైవర్‌ ఫర్‌ ది డే’ అంశాన్ని వారికి వివరించాలి.  

‘‘న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై స్టార్‌ హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్‌ హాళ్లు తదితరాల యజమానులతో సమావేశం నిర్వహించాం. ఈ ఏడాదీ రాత్రి ఒంటి గంట వరకే అనుమతి. ఆ తర్వాత నిర్వహించకూడదు. నిర్ణీత సంఖ్యకు మించి ఎక్కువ మంది హాజరయ్యే కార్యక్రమాలకు కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి. పార్కింగ్‌ ప్లేసులు ప్రొవైడ్‌ చెయ్యడంతో పాటు అక్కడా వీటిని ఏర్పాటు చేయాలి. వలంటీర్లు, ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు, ట్రాఫిక్‌ నిర్వహణ చేసే వారు కచ్చితంగా ఉండాల్సిందే. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఫైర్‌ సేఫ్టీకి సంబం«ధించిన చర్యలు తీసుకోవాల్సిందే. చిన్నారులు, మైనర్లు ఈ పార్టీలకే అంశంపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదు. డ్రగ్స్‌ వినియోగంపై కన్నేసి ఉంచాలి. ఈ చర్యలు కచ్చితంగా తీసుకుంటామని ఆయా యాజమాన్యాలు హామీ ఇచ్చాయి’’     – నగర పోలీసు ఉన్నతాధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top