కట్నం కోసం వేధించిన వారికి జైలు శిక్ష | husbands family jailed for harassment with dowry | Sakshi
Sakshi News home page

కట్నం కోసం వేధించిన వారికి జైలు శిక్ష

Mar 23 2017 8:28 PM | Updated on May 25 2018 12:54 PM

కట్నం కోసం కోడల్ని వేధించిన కేసులో అత్తింటివారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు.

జగిత్యాల జోన్ : కట్నం కోసం కోడల్ని వేధించిన కేసులో అత్తింటివారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.మధు గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అమరేందర్‌రావు కథనం ప్రకారం... జగిత్యాల పట్టణంలోని భీరయ్య గుడి ప్రాంతానికి చెందిన జ్యోత్స్నను చల్‌గల్‌ గ్రామానికి చెందిన మానాల మారుతికి ఇచ్చి 2008లో పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం ఇచ్చారు. ఏడాది పాటు వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు.

అప్పటి నుంచి భర్తతోపాటు మామ లక్ష్మీనారాయణ, అత్త ఈశ్వరమ్మ, బావ, ఆడబిడ్డలు మరో రూ.4 లక్షల కట్నం తేవాలని జ్యోత్స్నను శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ క్రమంలో భార్యను పుట్టింటికి పంపించి, మారుతి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు వారిపై జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో జగిత్యాల టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణలో ఆడబిడ్డ, బావపై కేసు నిరూపణ కాకపోవడంతో వారిని కేసు నుంచి తొలగించి, కోర్టులో భర్త, మామ, అత్త, రెండోభార్యపై చార్జీషీట్‌ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి ఐపీసీ 498ఏ ప్రకారం వారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఐదు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించారు. డీపీ యాక్ట్‌ 4లో భాగంగా అత్తింటివారికి ఆరు నెలల జైలు శిక్ష, మూడు వేల జరిమానా విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న రెండో భార్య లావణ్యపై కేసు నిరూపణ కాకపోవడంతో నిర్దోషిగా ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement